TEJA NEWS

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా జార్ఖండ్ పాలము నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని దేశ రాజకీయ పరిస్థితులపై ప్రసంగించారు. బీజేపీ, జార్ఖండ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.

కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఒక్క పైసా కుంభకోణం కూడా చేయలేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, జేఎంఎం ప్రజా ఆస్తులను దోచుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర అధికార పార్టీ జేఎంఎం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జేఎంఎం, కాంగ్రెస్‌ నాయకులు అవినీతితో అపార సంపద సృష్టించారన్నారు. ఆస్తులైనా, రాజకీయాలైనా తమ బిడ్డల కోసం సంపాదిస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా తన జీవితం గురించి ప్రస్తావించారు. తాను పేదరికం నుంచి వచ్చిన నాయకుడినని, అందువల్లే ఈ 10ఏళ్ల పాటు పేదలకు సంక్షేమం అందేందుకు కృషి చేశానన్నారు. తన ప్రభుత్వంలోని పథకాలు పేదలకు అందాయని, లబ్ధిదారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ల బాధలు చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. పేదరికాన్ని చూసిన వారికే ఈ కన్నీళ్లు అర్థమవుతాయి.

జార్ఖండ్‌లో ఉపాధిని పెంచాలని, ఇక్కడి ప్రజల జీవితాల్లో ప్రగతి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. జార్ఖండ్ ప్రజల భూములను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, జేఎంఎంల కళ్లు కేవలం ప్రజా ఆస్తులపైనే ఉన్నాయని, వారికి మరేమీ కనిపించడం లేదని ప్రధాని మోదీ విమర్శించారు.


TEJA NEWS