
మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు
- కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు
- మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ
హైదరాబాద్ ; మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు (Former CM KCR) కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), ఈటల రాజేందర్‌కు (Etela Rajender) కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం నిర్మాణం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాదిన్నరగా కమిషన్ విచారణ కొనసాగుతోంది. కమిషన్ విచారణ గడువు ఈ నెలాఖరితో ముగియనుంది. అయితే కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు (జూలై 31) వరకు పొడిగిచింది. కమిషన్ విచారణలో భాగంగా బ్యారేజీ నిర్మాణంలో పనిచేసిన ఏఈలు, డీఈలు, ఎస్‌ఈలతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులందరినీ కమిషన్ విచారించింది. వారి నుంచి అఫిడవిట్లరూపంలో వాంగ్మూలాన్ని స్వీకరించి.. వాటిని క్రాస్ ఎగ్జామిన్ చేయడంతో పాటు బహిరంగంగా విచారించింది కమిషన్. ప్రాజెక్టులను నిర్మించిన కంపెనీల ప్రతినిధులను కూడా విచారించింది.
అలాగే ప్రాజెక్ట్ డిజైన్లు చేసిన కంపెనీల ప్రతినిధులను కూడా కమిషన్ ఎంక్వైరీ చేసింది. ఈ ఏడాది పాటు సుదీర్ఘంగా జరిపిన ఈ విచారణలో దాదాపు అందరూ కూడా కేసీఆర్ పేరే చెప్పినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి సంబంధించిన స్థలాల ఎంపికను ఎవరు చేశారని ప్రశ్నించగా.. ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరునే ప్రస్తావించినట్లు సమాచారం. స్థలాల ఎంపిక, బ్యారేజీలకు సంబంధించి కీలక నిర్ణయాలు, చెల్లింపుల నిర్ణయాల్లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్, అప్పటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రమేయంతో జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కాళేశ్వరం కమిషన్ విచారణ దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాలతో ఓ నివేదికను కూడా సిద్ధం చేసింది.
జూన్ 5 లోపు వాళ్లు ఎంచుకున్న తేదీ అయినా లేదా కమిషన్ నిర్ణయించిన తేదీల్లో విచారణ హాజరుకావాల్సిందిగా నోటీసులు తెలియజేశారు. అయితే కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేక న్యాయపరంగా ఎదుర్కుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.
