
నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి….
లేకుంటే ఆర్జీ-1 ప్రధాన కార్యాలయం ముట్టడి….
— రియాజ్ అహ్మద్….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని,
సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని నర్సరీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ప్రతిరోజూ పని, భవిష్య నిధి, బోనస్, ఉచిత వైద్య సౌకర్యాలు అందించాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆర్జీ-1 ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
నర్సరీ కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ రియాజ్ అహ్మద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత 26 సంవత్సరాలుగా 14 మంది కార్మికులు నర్సరీలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ సింగరేణి పచ్చదనానికి విశేష సేవలందిస్తున్నారని అన్నారు.
ప్రాణాలను పణంగా పెట్టి పాములు, తేళ్ల మధ్య పనిచేస్తూ సుమారు 12 లక్షల మొక్కలను పెంచి సంరక్షించారని, ఎరువులు వేయడం, నీరు పట్టడం, మొక్కల తరలింపు, లోడింగ్, అన్‌లోడింగ్ వంటి కఠినమైన పనులు చేస్తున్నప్పటికీ అతి తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారని పేర్కొన్నారు.
నర్సరీ టెండర్ గడువు ముగిసి ఐదు నెలలు గడిచినా కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో, గత నెల రోజులుగా కార్మికులకు పనులు సక్రమంగా కేటాయించడం లేదని ఆరోపించారు. టెండర్లతో సంబంధం లేకుండా గత ఏడాది మాదిరిగానే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులందరికీ సంబంధిత శాఖ ద్వారా పని కల్పించాలని డిమాండ్ చేశారు.
నర్సరీ పనుల్లో అనుభవం లేని ఇతర విభాగాల సిబ్బందిని తీసుకురావడం వల్ల మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉందని, ఎన్నో ఏళ్లుగా సింగరేణి సంస్థను నమ్ముకుని జీవిస్తున్న ఈ పేద కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు ప్రతిరోజూ పని కల్పించడంతో పాటు భవిష్య నిధి, బోనస్, ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించి న్యాయం చేయాలని కోరారు. యాజమాన్యం వెంటనే స్పందించకపోతే నర్సరీ కార్మికులందరినీ ఐక్యం చేసి ఆర్జీ-1 ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని రియాజ్ అహ్మద్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నర్సరీ కార్మికులు నరహరి పద్మ, చెర్ల రాజేశ్వరి, మాదాసి వనమాల, మాదాసి లక్ష్మి, పోగుల లక్ష్మి, అనపురం శారద, ఈశ్వరి, మినుము సుజాత, గాధం లక్ష్మి, కన్నూరు రాజేశ్వరి, ఆడెపు లక్ష్మి, రాజమణి, ఓదమ్మ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.
