TEJA NEWS

Ok for celebrations

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండా

జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుక.. సోనియాకు సన్మానం

రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్‌

రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం ఆవిష్కరణ

దశాబ్దాల తెలంగాణ కల సాకారమై దశాబ్దం కావొస్తోంది! అందునా రాష్ట్రంలో అధికారంలో ఉన్నది.. ఆ కలను సాకారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ!! ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిం చేందుకు రేవంత్‌ సర్కారు ఉవ్విళ్లూరుతోంది. కానీ.. కోడ్‌ అమల్లో ఉన్నందున ఇందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం లేఖ రాయగా.. ఈసీ పచ్చజెండా ఊపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది!!

హైదరాబాద్‌: మే 24 రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ వేడుకల నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి.. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రేవంత్‌ సర్కారు కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు. కాగా.. యూపీఏ చైర్‌ పర్సన్‌ హోదాలో అన్ని వర్గాలనూ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీకి ప్రభుత్వ పరంగా ఉత్సవ వేదికపై సన్మానం జరగనుంది. అలాగే, తెలంగాణ రాష్ట్ర గేయం ‘జయజయహే తెలంగాణ’ను ఇదే వేదిక ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాష్ట్ర చిహ్నాన్ని ఆవిష్కరించాలన్న ప్రతిపాదనా పరిశీలనలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసినవారి కుటుంబాలకు సన్మానం, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇచ్చే అంశాలపైనా పరిశీలన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక మహిళా సంఘాలను ఆహ్వానించి వారి సమక్షంలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

రాహుల్‌, ప్రియాంకకూ ఆహ్వానం!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియాగాంధీకి ఈ వేడుకల్లో ఘన సన్మానం చేయాలని తీర్మానించిన రాష్ట్ర మంత్రిమండలి.. ఈ మేరకు ఆమెకు ఇప్పటికే ప్రతిపాదన పంపింది. అలాగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాలుపంచుకోవాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలనూ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతించిన నేపథ్యంలో శనివారం లేదా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని కలిసి ఆహ్వానించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతోపాటు అందుబాటులో ఉన్న మంత్రులూ వెళ్లే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి సోనియాను ఆహ్వానించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో సహా ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, సోనియా రాజ్యసభ సభ్యురాలు కాబట్టి ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించడంపై ఎలాంటి సమస్యా ఉండదన్న ధీమాను కాంగ్రెస్‌ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్ర గేయం.. రెండు వెర్షన్లూ..

కవి అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ ‘గీతాన్ని రాష్ట్ర గేయంగా ప్రభుత్వం స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరకల్పనలో ఈ గేయాన్ని తీర్చిదిద్దడం ఒక కొలిక్కి వచ్చింది. ఈ గేయాన్ని అధికారిక కార్యక్రమాల్లో వాడేందుకు నాలుగు చరణాలతో, 90 సెకన్ల నిడివితో ఒక వెర్షన్‌.. 14 చరణాలు, 6 నిమిషాల నిడివితో పూర్తి వెర్షన్‌ సిద్ధమయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవ వేదికపై నుంచి ఈ రెండు వెర్షన్లనూ సీఎం రేవంత్‌ తెలంగాణ ప్రజలకు అంకితం చేయనున్నారు.

కాంగ్రెస్‌ ముద్ర!

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా.. తొలి, మలి ఎన్నికల్లో ఆ క్రెడిట్‌ను కేసీఆర్‌ కొట్టేశారన్న అసంతృప్తి కాంగ్రెస్‌ నాయకత్వంలో ఉంది. అయితే రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంలో తాము అధికారంలో ఉండడంతో.. దీన్ని సదవకాశంగా తీసుకుని ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, తమదైన ముద్ర వేయాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు.


TEJA NEWS