దళిత ఉద్యోగి పై దౌర్జన్యం
** డాక్యుమెంట్ రైటర్ల అమానుష చర్యలు
** లంచం ఇవ్వొద్దన్నందుకు దాడి
తిరుపతి: జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వివిధ రకాల పనులపై కార్యాలయంకు వచ్చే వినియోగదారులు లంచాలు, అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని, కేవలం ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని, అలాగే డాక్యుమెంట్ రైటర్ లకు కూడా వారి యొక్క టైపింగ్ చార్జీలు మాత్రమే ఇస్తే సరిపోతుందని క్రయ, విక్రయ దారులకు చెప్పిన అటెండర్ ఎన్.తిరుమలేష్ పై కొందరు డాక్యుమెంట్ రైటర్లు దాడికి తెగబడ్డారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి… పైగా దళితుడైన తిరుమలేష్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. లంచం ఇవ్వొద్దని, అధిక మొత్తంలో డబ్బులు ఇవ్వొద్దని చెప్తావా…. అంటూ అతనిపై మూకుమ్మడి దాడికి ప్రయత్నించారు. అవినీతికి అలవాటు పడ్డ కొందరు రైటర్లకు మాత్రమే తాను వ్యతిరేకమని తిరుమలేష్ చెపుతున్నప్పటికి అతన్ని కొందరు రైటర్లు దౌర్జన్యంగా చుట్టుముట్టారు. ఒక ప్రభుత్వ దళిత ఉద్యోగినైన తన పై రైటర్ల ముసుగులో కొందరు అనధికార డాక్యుమెంట్ రైటర్లు వచ్చి దాడి చేయడాన్ని తిరుమలేష్ తీవ్రంగా ప్రతిఘటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచిక బోర్డులు ఉన్నాయని, గతంలో కూడా రేణిగుంట కార్యాలయంలో బోర్డులు కూడా పెట్టామని అయితే కొత్తగా వచ్చిన ఇన్చార్జ్ సబ్ రిజిస్టార్ ఆనంద రెడ్డి బోర్డులన్నీ తొలగించేశారని తిరుమలేష్ ఆరోపించారు.. వినియోగదారులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఎవరైనా అధిక మొత్తంలో డబ్బులు అడిగితే 1800 కు ఫోన్ చేయమని తాను చెప్పడమే నేరమా అని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా తన విధుల్లో భాగంగా కార్యాలయంలోకి వచ్చి మధ్యవర్తుల నమ్మి మోసపోతున్నటువంటి వినియోగదారులకు అవగాహన కల్పించడం తన బాధ్యతని…. ఇందులో భాగంగానే ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బు అడిగినా, కార్యాలయంలో పనులు చేయిస్తామని చెప్పి డబ్బులు డిమాండ్ చేసినా, అలాంటి వారిని నమ్మొద్దని తాను చెప్పానని తిరుమలేష్ తెలిపాడు. కొందరు డాక్యుమెంట్ రైటర్లను ఆనంద రెడ్డి వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని అతను ఆరోపించారు.తనపై దాడి చేసిన వారందరిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి అనుమతి ఇవ్వాల్సినదిగా సబ్ రిజిస్ట్రార్ ను కోరుతానని,, అలాగే ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆనందరెడ్డి తీరును కూడా పై అధికారులకు వివరిస్తానని తెలిపారు.
