
అధికారుల వేతన సవరణ వెంటనే అమలు చేయాలి.. లేకుంటే సంయుక్త పోరాటాలు తప్పవు….
— కందుకూరి రాజరత్నం…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని,
సింగరేణి అధికారుల సంఘం చేపట్టిన నిరాహార దీక్షలు తొమ్మిది రోజులుగా కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కందుకూరి రాజరత్నం అన్నారు.
అధికారుల సంఘం నిర్వహిస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించిన ఆయన మాట్లాడుతూ, అధికారులకు రావాల్సిన వేతన సవరణ ప్రయోజనాలను వెంటనే అమలు చేయాలని యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ఒకవేళ వేతన సవరణ అమలులో మరింత జాప్యం జరిగితే కార్మిక సంఘాలు, అధికారుల సంఘాలు కలిసి సంయుక్తంగా ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఆ పరిస్థితికి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కందుకూరి రాజరత్నం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అధికారుల సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
