సింగరేణిలో భద్రతా, ఉత్పత్తి పరికరాల కొరత వెంటనే తీర్చాలి…..

TEJA NEWS

సింగరేణిలో భద్రతా, ఉత్పత్తి పరికరాల కొరత వెంటనే తీర్చాలి…..

— ఏఐటీయూసీ….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని,
సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేసి, గనుల్లో నెలకొన్న ఉత్పత్తి, భద్రతా పరికరాల కొరతను తక్షణమే నివారించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు ఏఐటీయూసీ ఆర్జీ–1 శాఖ ఆధ్వర్యంలో ఆర్జీ–1 ఏరియాలోని గనులు, ఓసీపీ–5తో పాటు వివిధ విభాగాల అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, శాఖ కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో కార్మికులకు అవసరమైన ఉత్పత్తి, భద్రతా పరికరాల కొరత తీవ్రంగా ఏర్పడిందని ఆరోపించారు.

గత ఏడాది కాలంగా డ్రిల్ రాడ్లు, డ్రిల్ బిట్లు, చెమ్మసులు, డాగ్ నెయిల్స్, గిరిమిట్లు, సాంకేతిక సిబ్బందికి అవసరమైన పనిముట్లు, ట్యూబ్‌లైట్లు వంటి ఉత్పత్తి సామగ్రితో పాటు బూట్లు, సాక్స్, చేతి తొడుగులు, హెల్మెట్లు, క్యాప్ ల్యాంపులు, భద్రతా క్యానిస్టర్లు, ప్రథమ చికిత్స పెట్టెలు, పేలుడు పనులకు అవసరమైన కేబుళ్లు వంటి అత్యవసర రక్షణ పరికరాలు అందుబాటులో లేవని తెలిపారు.

విడిభాగాలు, పనిముట్ల కొరత కారణంగా ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారిందని, పాత యంత్రాలతో పనిచేయాల్సి రావడంతో యంత్రాల నిర్వాహకులు నడుము నొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమస్యలను భద్రతా కమిటీ, గనుల కమిటీ, త్రైపాక్షిక భద్రతా సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సంస్థను బలహీనపరిచే పరిస్థితి తీసుకొచ్చాయని విమర్శించారు.

ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ఉత్పత్తి, భద్రతకు అవసరమైన అన్ని పరికరాలను సమకూర్చడంతో పాటు కొత్త యంత్రాలను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీ–1 శాఖ నాయకులు మాదన మహేష్, సంకె అశోక్, బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, సిద్దమల్ల రాజు, ఎం. చక్రపాణి, దొంత సాయన్న, చెప్యాల భాస్కర్, పిట్ కార్యదర్శులు మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, గొడిశెల నరేశ్, చంద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top