పట్నం నరేందర్ రెడ్డిని మళ్లీ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్:
చర్లపల్లి జైలు నుంచి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నారు. లగచర్ల దాడి ఘటనలో రెండు రోజుల పాటు ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
డిసెంబర్ 7, 8 తేదీల్లో నరేందర్ రెడ్డిని పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఉన్న సురేశ్ ను పోలీసులు రెం డు రోజులు విచారించారు. నవంబర్ 11న లగచర్లలో అధికారుల దాడి ఘటనపై పోలీసులు విచారించను న్నారు.
ఈ ఘటన జరగడానికి ముందు సురేశ్ , పట్నం నరేందర్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణలున్నాయి. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. తమ పార్టీకి సంబంధించిన విషయమై మాట్లాడేందుకు సురేశ్ తనకు ఫోన్ చేశారని ఈ కేసులో అరెస్ట్ కాకముందు నరేందర్ రెడ్డి మీడియాకు చెప్పారు.
దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు విషయమై లగచర్ల- దుద్యాలలో నవంబర్ 11న ప్రజాభిప్రాయసేకరణ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గ్రామస్తులు హాజరుకాలేదు. అయితే గ్రామానికి వచ్చి ప్రజల అభిప్రాయం తెలుసుకో వాలని సురేశ్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కోరారు.
దీంతో కలెక్టర్ ఇతర అధికారులు గ్రామానికి వెళ్లారు. కలెక్టర్, ఇతర అధికారులను చూడగానే గ్రామస్తులు నిరసనకు దిగారు. ఫార్మా క్లస్టర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని సురక్షితంగా పంపారు. అయితే కడా అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు దాడికి దిగారు.