BRS Focus : సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం..జనవరి 3 నుంచి ముహూర్తం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అధికారాన్ని కోల్పోయింది. 39 సీట్లతో సరి పెట్టుకుంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కంకణం కట్టుకుంది. మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను ఎలాగైనా సరే అన్ని సీట్లను కైవసం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేస్తున్నారు.
ఇందులో భాగంగా విస్తృతంగా సభలు, సమావేశాలు, సమీక్షలు చేపట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీ. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ భవన్ వేదికగా వరుసగా ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు కేటీఆర్.
బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కేటీఆర్. అయితే 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. 3 నుంచి జనవరి 12వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగనున్నాయి. మధ్యలో పండగ రానుండడంతో తేదీలు మార్చినట్లు చెప్పారు కేటీఆర్.
3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం ఉంటుందని తెలిపారు. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్ , 8న జహీరాబాద్ , 9న ఖమ్మం, 10న వరంగల్ , 11న మహబూబాబాద్ , 12న భువనగిరి, 16న నల్లగొండ, 17న నాగర్ కర్నూల్ , 18న మహబూబ్ నగర్, 19న మెదక్ , 20న మల్కాజ్ గిరి, 21న సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు.