TEJA NEWS

Ramoji Rao is a great person who has left an indelible mark in the fields of media and cinema

మీడియా, సినిమా రంగాలలో తనదైన చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ మృతి వార్త తెలుసుకున్న మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో రామోజీరావు పార్దీవదేహం వద్ద నివాళులు అర్పించారు. ఆయన మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామోజీరావు తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సాధారణ వ్యక్తిగా జీవనం ప్రారంభించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ అతిపెద్ద వ్యాపారవేత్త గా ఎదిగారు. తాను ఏర్పాటు చేసిన వివిధ సంస్థల ద్వారా లక్షలాదిమంది కి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. ఈనాడు పత్రిక ద్వారా అనేక వాస్తవాలను వార్తల రూపంలో తీసుకొచ్చి తెలుగు ప్రజల మనసులలో నిలిచిపోయారని అన్నారు. ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా గర్వపడే విధంగా ఎంతో అద్భుతమైన ఫిల్మ్ సిటీ ని తీర్చుదిద్దిన ఘనత కూడా రామోజీరావు కే దక్కుతుందని అన్నారు. ప్రజాహితం, సమాజహితం కోసం కృషి చేసిన రామోజీరావు మృతి ఒక్క తెలుగు ప్రజలకే కాదని, దేశానికి కూడా తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.


TEJA NEWS