TEJA NEWS

పండుగ వాతావరణంలో రైతు రుణమాఫీ మలివిడత నిధుల విడుదల

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ-2024 మలి విడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయం ఆవరణ నుండి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి రుణమాఫీ నిధులను విడుదల చేయగా, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ అందరం నుండి జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, బ్యాంకర్లు,
ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించి, ముఖ్యమంత్రి సందేశాన్ని తిలకించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లబ్దిదారులైన పలువురు రైతులకు రెండవ విడత రుణమాఫీకి సంబంధించిన చెక్కులను లాంఛనంగా అందజేశారు.

ఈ సందర్భంగా రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ద్వారా జిల్లా రైతుల ఖాతాలలో 174.73 కోట్లు రూపాయలు జమ చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ నెల 18న లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీ చేయగా, మలివిడతగా ప్రస్తుతం లక్షా 50 వేల రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసిందన్నారు.
రుణమాఫీ ద్వారా జిల్లాలో మొదటి విడతలో 24398 మంది రైతు కుటుంబాలకు రూ. 144.09 కోట్ల మేర లబ్ది చేకూర్చగా, మలివిడతలో 18141 మంది రైతు కుటుంబాలకు రూ. 174.73 కోట్ల నిధులను వారి ఖాతాలలో ప్రభుత్వం జమ చేసిందని కలెక్టర్ వివరించారు. రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రుణమాఫీ కార్యక్రమం జిల్లాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేలా అధికార యంత్రాంగం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడైనా క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఫిర్యాదులను స్వీకరించి ప్రతి ఒక్క రైతుకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని, అర్హులైన ప్రతి రైతు ప్రయోజనం పొందేలా బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులు అన్నదాతలకు తోడ్పాటును అందించాలని ఆదేశించారు. ఏ ఒక్క రైతు అసౌకర్యానికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని స్పష్టం చేశారు.
తొలి, మలి విడతలలో రుణమాఫీ పొందిన రైతులందరికీ జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ , జిల్లా సహకార శాఖ అధికారి ప్రసాద్ రావు, లీడ్ బ్యాంకు మేనేజర్ అయ్యపు రెడ్డి, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు…


TEJA NEWS