
మైలవరం నియోజకవర్గంలో ప్రధాన సమస్యలపై మినీ మహానాడులో తీర్మానాలు.
వెల్లడించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మైలవరంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో నియోజకవర్గంలో నాలుగు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు.
1.బుడమేరు, పులి వాగు కట్టల పునరుద్ధరణ.
బుడమేరు పరివాహక ప్రాంతంలో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సంభవించిన భారీ వర్షాల కారణంగా బుడమేరుకు, వాగులు, చెరువులకు భారీగా గండ్లు పడ్డాయని, వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని, ఇందుకు అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చేయాలని మినీ మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పలువురు నాయకులు దీన్ని బలపరిచి, ఆమోదించారు.
- చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలి.
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని మరో నిర్మాణాన్ని మినీ మహానాడు ఆమోదించింది. 2017లో ప్రారంభించబడిన ఈ పథకనికి సంబంధించి రూ.3,038 కోట్ల పనులు పూర్తి కాగా, 2014-19 మధ్య టీడీపీ హయాంలో 65 శాతం పనులు పూర్తి అయినట్లు వెల్లడించారు. 4.8 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 21 లక్షల మంది జనాభాకు తాగునీరు ఈ పథకం ద్వారా అందుతుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టు మూలన పడిందన్నారు. ఇప్పుడు తాజాగా పెరిగిన ధరల ప్రకారం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అంచనా వ్యయం రూ.9,500 కోట్లు పెరిగిందన్నారు. ఈ పథకాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీటి భద్రత కల్పించాలని తీర్మానించారు.
- జి.కొండూరు మండలంలో ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలి.
జి.కొండూరు మండలంలో వృధాగా పడి ఉన్న సుమారు 250 ఎకరాల భూమిలో ఇండస్ట్రీ కారిడార్ అభివృద్ధి చేయాలని మరో తీర్మానాన్ని మినీ మహానాడు ఆమోదించింది. సున్నంపాడు గ్రామంలో గత ప్రభుత్వ హాయంలో సుమారు 250 ఎకరాల భూమిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లబ్ధిదారుల కోసం కొనుగోలు చేశారన్నారు. కానీ అక్కడ నివాసానికి చూపలేదన్నారు. తాజాగా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, నిరుపయోగంగా ఉన్న భూములు వాణిజ్యపరంగా వృద్ధి చెందుతాయన్నారు.
- ఎన్టీటీపిఎస్ బూడిద కాలుష్యం నివారణకు విజ్ఞప్తి.
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విడుదలవుతున్న బూడిద కాలుష్యం వల్ల సమీప, పరిసర గ్రామాల ప్రజలు శ్వాసకోస వ్యాధులకు గురై, అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు. వాయు కాలుష్యంతో పాటు, తాగునీరు, భూగర్భ జలాలు ఆహార పదార్థాలు, కూడా బూడిద కాలుష్యం బారిన పడుతున్నాయన్నారు. కాలుష్య నివారణకు బూడిద రవాణా చేసే ట్రక్కులను పూర్తిగా కవర్ చేసి తరలించాలన్నారు. కాలుష్య శుద్ధి యంత్రాలను, నీటి స్ప్లింకర్లు వినియోగించాలన్నారు. స్థానిక ప్రజలకు ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ తీర్మానాన్ని కూడా మినీ మహానాడులో ఆమోదించారు.
