రేవంత్… చంద్రబాబులా పాలించు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌లా రైతులకు అన్యాయం చేస్తున్నారని.. ఏపీ సీఎం చంద్రబాబులా సుపరిపాలన అందించాలని భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు. ఏపీ ప్రయోజనాలే ధ్యేయంగా పెద్దపెద్ద సంస్థలతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని.. రేవంత్ మాత్రం ఇచ్చిన హామీలే అమలు చేయలేకపోతున్నారని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలంలోని గన్నారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అర్వింద్ పరిశీలించారు. ప్రస్తుతం అన్నదాతల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు ఉందని పేర్కొన్నారు.
అసంపూర్తిగా రుణమాఫీ చేశారని దుయ్యబట్టారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వాలు ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నాయని అర్వింద్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది ప్రధాని మోదీయేనని చెప్పారు. హైడ్రా తీరుపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. పేదల ఇళ్లనే కూల్చివేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకొంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు