పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి
కమిషనర్ రాహుల్ మీనా
ప్రమాదాలకు, అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. తెల్లవారుజామున వీఎల్ పురం పరిసర ప్రాంతాలలో ఆయన పర్యటించారు. జోరు వానలోనూ ఇబ్బంది పడకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు. పారిశుద్ధ్య సిబ్బంది భద్రత కోసం అందజేసిన వ్యక్తిగత రక్షణ కిట్ ఉపయోగించడంతో పాటు వర్షంలో రెయిన్ కోట్లను తప్పనిసరిగా ధరించాలన్నారు. రాత్రిపూట పనిచేయు సిబ్బందికి రేడియం అప్రాన్ లు తప్పనిసరి అని తెలియజేశారు. ఇవి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అలాగే నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా అంటువ్యాదులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం పలుచోట్ల కూలిన చెట్ల వద్ద తొలగింపు చర్యలను పర్యవేక్షించారు. ఈదురుగాలులకు నగరంలో ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అలాగే తుఫాన్ దృష్ట్యా ప్రజలు కూడా రానున్న రెండు, మూడు రోజులు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
