అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
** కమిషనర్ మౌర్య ఆదేశం
తిరుపతి: వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలోని స్కావేంజర్స్ కాలనీ, అబ్బన్న కాలనీ, మారుతినగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. తుఫాన్ వలన గుంతలు పడ్డ రోడ్లు, మురుగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడా నిలబడ్డ వర్షపు నీటి వలన అంటురోగాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఎక్కడగానీ వర్షపునీరు, చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు. వర్షపు నీరు ఆగి ఉన్న ప్రాంతాల్లో మలాథిన్ పిచికారీ చేయాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల లార్వా వృద్ధి చెందకుండా చూడాలని కోరారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజూ ఫాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు. వర్షం వలన పాడైన రోడ్లు, మురుగునీటి కాలువలను మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట 33 వ వార్డు కార్పొరేటర్ దూది కుమారి, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, ఏసిపి మూర్తి, డి.ఈలు రాజు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి తదితరులు ఉన్నారు.
