ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించండి : ఎమ్మెల్యే జారే
దళారుల చేతిలో మోసపోవద్దు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం (ఖరీఫ్ 2025-26) ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యం అన్నారు. ప్రతి రైతు కష్టపడి పండించిన ప్రతి గింజను ప్రభుత్వం తగిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని తెలిపారు. సన్న రకం వరి ధాన్యానికి క్వింటాల్కు 500/- బోనస్ అందజేస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ పంటను సమీప కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రైతులకు తగిన సదుపాయాలు కల్పించబడతాయని ధాన్యం తూకం చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. దళారుల చేతిలో మోసపోవద్దని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మార్కెట్ కమిటీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
