DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు..
కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని ఆయన మంగళవారం అన్నారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 2004లో సోనియాగాంధీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు.
యూపీఏతో సంబంధం లేకుండా ఎంపీలంతా ఆమెను ప్రధాని చేయాలని కోరారని, అయితే ఆమె మన్మోహన్ సింగ్‌ని ప్రధాని చేసిందని, యూపీఏ మొత్తం ఆమె ప్రధాని కావాలని కోరుకున్నప్పటికీ, ఒక ఆర్థికవేత్త కోసం త్యాగం చేశారని అన్నారు. ఒక మహిళ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకుని దేశం కోసం మన్మోహన్ సింగ్‌ని నామినేట్ చేశారని, అది దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగమని, అది గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగమని డీకే శివకుమార్ అన్నారు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ఇలాంటి త్యాగం చేస్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. పార్లమెంట్ సభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడుతున్నారని, అతను నడిచినంత దూరం దేశంలో ఏ నేత నడవలేదని కొనియాడారు. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధానిగా రాహుల్ గాంధీ కావచ్చు, కానీ ఆయన ఎప్పుడూ అధికారం వైపు చూడలేదని, పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం మాత్రమే ఐక్యంగా ఉంచగలదని, కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందని, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అతిపెద్ద బలమని, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచిందని ఆయన అన్నారు..
2004లో ‘ఇండియా షైనింగ్’ అనే నినాదంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు రాగా.. కాంగ్రెస్ 145, సీపీఎం 43, ఎస్పీ 43, ఆర్జేడీ 24 సీట్లను గెలుచుకున్నారు. యూపీఏ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. 2009లో మరోసారి యూపీఏ అదికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగబోతున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి..