
శ్రీ దత్త ప్రసాదం – 58- శ్రీ దత్తాత్రేయ దీక్షా ఫలితం
పాఠకులకు నమస్కారం, ఆ వ్యక్తి పేరు తిరుపతయ్య, వారి ఊరు మన దత్తా క్షేత్రానికి దగ్గరలోనే ఉంటుంది. వృత్తి రీత్యా తిరుపతయ్య హైదరాబాద్ లో కట్టుబడి మేస్త్రి గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో తిరుపతయ్య గారు ఉండేది కూడా వారి ఉరి వారైనా మరో నలుగురితో కలిసి. ఆ నలుగురి వ్యక్తులకు కూడా మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారంటే ఎంతో భక్తి, తమ భక్తిని చాటుకొనే విధంగా ఆ నలుగురు అప్పటికే ఒక 6 సంవత్సరాల పాటు మన మందిరము వద్ద శ్రీ దత్తాత్రేయుని దీక్షను కూడా తీసుకున్నారు.
ఇక ఆ సంవత్సరం కూడా మన దత్తక్షేత్రం వద్ద దీక్షాధారణ మహోత్సవాల తేదీలను మందిరం వారు ప్రకటించారు. ఆ సమాచారం తెలుసుకున్న తిరుపతయ్య గారి సహచరులు ఎప్పటి లాగానే ఆ సంవత్సరం కూడా దత్త దీక్ష తీసుకునేందుకు సన్నద్దులయ్యారు, అంతే కాదు తిరుపతయ్య గారిని కూడా దీక్ష తీసుకోమని ప్రోత్సహించారు. తిరుపతయ్య గారు కూడా మన దత్తాత్రేయులు మీద తనకి ఉన్న భక్తిని చాటుకోవటానికి అవకాశం ఇచ్చారు అని భావించారు. దీక్షాధారణ ప్రారంభం అవ్వగనే తిరుపతయ్య గారు మరియు వారి సహచరులు మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద వ్యవస్థాపక ధర్మకర్త గారైన నాగేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా దీక్షను స్వీకరించారు. తిరుపతయ్య గారికి నాగేంద్రప్రసాద్ గారితో అంతకుమునుపే పరిచయం ఉండడంతో, నాగేంద్రప్రసాద్ గారిని ఒకసారి పలకరించి, మళ్ళీ దీక్షావిరణముకు మందిరానికి వచ్చి వెళ్తానని చెప్పి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ చిత్రంగా ఆ శనివారమే తిరుపతయ్య గారు మన మందిరములో జరిగే పల్లకీ సేవ ఎంత శోభాయమానంగా జరుగుతుందో తెలియవచ్చి, ఉత్సుకత ఆపుకోలేక పల్లకి సేవలో పాల్గొంటానికని మందిరము వద్దకు వచ్చేసారు.
ఆ నాడు దీక్షాధారులు మరియు భక్తుల మధ్య జరిగిన విశేష పల్లకీ సేవను చూసిన తిరుపతయ్య గారికి, ఇక దీక్షకాలం అంతా మందిరము వద్దనే గడపాలనే నిశ్చయనికి వచ్చేసారు. వెంటనే తాను పనిచేస్తున్న బిల్డర్కు ఫోన్ చేసి వివరం తెలిపారు. అదేమి చిత్రమో కానీ తిరుపతయ్య ఇలా మన దత్తదీక్ష కారణం చేత పనికి రాలేకపోతున్నాను అని చెప్పిన వెంటనే ఆ యజమాని సెలవ ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. తరువాత తిరుపతయ్య గారు నాగేంద్రప్రసాద్ గారి దగ్గర అనుమతి తీసుకొని, దీక్షా కాలం అంతా మన దత్త మందిరములోనే మన శ్రీ స్వామి వారికి మరియు భక్తులకు జరిగే అనేక సేవలలో పాలుపంచుకొని, వైశాఖ శుద్ధ సప్తమి నాడు దీక్ష విరమణ చేసి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఒక మెస్త్రిగా దీక్షా విరమణ చేసి వెళ్లిన తిరుపతయ్య గారు, తరువాతి సంవత్సరం దీక్ష తీసుకునేందుకు బిల్డర్ గా వచ్చారు. వారి మాటలు ప్రకారం అప్పుడు ఒక 50 మందికి జీవనభృతి కలిపించే స్థాయికి ఎదిగారు. అంతేకాదు దానికి వారు చెప్పిన కారణం సర్వం శ్రీ దత్త కృప అని. పాఠకులారా, ప్రస్తుతం, మన మందిరము వద్ద శ్రీ దత్తాత్రేయ దీక్ష కొనసాగుతోంది. అలానే, ఏప్రిల్ 11, 12 మరియు 13 వ తేదీలలో అర్థమండల దీక్షాధారణ జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు తప్పక వినియోగించుకోవాలని నా వ్యక్తిగత విన్నపం. అలానే మన మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని కూడా తప్పక దర్శించి తరించండి. ఇక మరొక అందమైన శ్రీ దత్తప్రసాదంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అందుకొఱకు, అంతవరకు మరియు అటుపైన…..
