సూర్యాపేటలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి : చండ్ర అరుణ, సి.హెచ్ శిరోమణి

Spread the love

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలో జూన్ 2,3 తేదీలలో జరిగే ప్రగతిశీల మహిళ సంఘం(పిఓడబ్ల్యు) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని పిఓడబ్ల్యూ మాజీ రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విలేఖర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిఓడబ్ల్యూ మాజీ ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సి హెచ్. శిరోమణి పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మహిళలు అనేక రకాల వివక్ష లకు గురవుతున్నారని, అణచివేత, దోపిడీలకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బేటి బచావో బేటి పడావో అన్న ప్రధాని మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగిస్తే, తుపాకీ మడమలతో గుద్దుతూ, బాయినట్లతో పొడుస్తూ చిత్రహింసలకు గురిచేసి చివరకు తూటలతో కాల్చితే ఇప్పటి వరకు మౌనం వీడని ప్రధాని మహిళల పక్షపాతి అని బిజెపి బండి సంజయ్ లాంటి నాయకులు చెప్పడం అంటే మహిళలను అవమానపరచడమే అన్నారు.మన పాలకులు మహిళలను అడుగడుగునా అవమాన పరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును కూడా పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవకుండా అవమానించారని అన్నారు.

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ అని చెప్పిన ప్రధాని, దానిని అమలు పరచకుండా వచ్చే పార్లమెంటుకు వాయిదా వేయటం సిగ్గుచేటు అన్నారు. కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తామన్న మోది, నిత్యవసర సరుకులు ధరలు ఆకాశాన్నింటే లాగా చేశారన్నారు. ఉప్పు,పప్పు, బియ్యం,నూనె ధరలు భారీగా పెరిగాయి. ఇలాంటి పాలకులు దేశాన్ని పరిపాలిస్తుంటే మహిళలు ఏ విధమైన గౌరవం పొందుతారని నిలదీశారు బిజెపి అనుసరిస్తున్న హిందూ మతోన్మాద ఫాసిస్టు విధానాలతో సమస్త ప్రజానికం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది ఉద్యోగాలు సృష్టిస్తామన్న పాలకులు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు అన్నారు. నిరాశ నిస్పృహలతో కొట్టు మిట్టడుతున్న యువత తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తారనే భయంతో మతం అనే మత్తు మందు చల్లి రామ మందిర నిర్మాణం,కృష్ణ జన్మస్థానం అంటూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. ఇలాంటి రాజకీయాలను ఎండగడుతూ మహిళల సమాన హక్కుల కోసం,పురుషాధిపత్య భావజాలానికి వ్యతిరేకంగా మహిళలను చైతన్యవంతం చేయడంలో ప్రగతిశీల మహిళా సంఘం ముందు వరుసలో ఉందన్నారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులను పేదలకు అందించాలని చేసే పోరాటంలో పిఓడబ్ల్యు కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. మనవాద భావజాలాన్ని ఎండగడుతూ సమసమాజ నిర్మాణం కోసం పురుషులతో సమానంగా మహిళలు పోరాడాలని పిఓడబ్ల్యు విశ్వసిస్తుంది అన్నారు. ఇలా ఇంకా అనేక సమస్యలపై మహిళలను చైతన్యవంతం చేయటం కోసం జూన్ 2,3 తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు ప్రజలందరూ సంపూర్ణ మద్దతును ప్రకటించుతూ, తమకు తోచిన ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు రాష్ట కోశాధికారి ఝాన్సీ,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page