Spread the love

నేరమయ రాజకీయాలపై ‘సుప్రీం’ వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • నెయ్యిలో కల్తీ జరిగిందనడం చంద్రబాబు కట్టుకథ అన్న జగన్ సిట్ అరెస్ట్ లపై ఏమంటారు: ప్రత్తిపాటి.
  • తీగలాగితే డొంక కదిలినట్టు కల్తీ నెయ్యి గుట్టు రట్టు అయ్యింది. త్వరలోనే అడవుల ఆక్రమణదారులు.. మద్యం మాఫియా ఆగడాలు కూడా బయటకొస్తాయి : పుల్లారావు.

నేరమయ రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యలు అవినీతి, విద్వేష రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ వంటి పార్టీలకు చెంపపెట్టని, జగన్ తన పార్టీని హత్యా రాజకీయాల పునాదులపై నిర్మించాడని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. “ క్రిమినల్ కేసులున్న వారు చట్టసభల్లో అడుగుపెట్టి, పరిపాలకులు అయితే ఎలాంటి ఉపద్రవాలు సంభవిస్తాయో చెప్పడానికి రాష్ట్రమే పెద్ద ఉదాహరణ. గడచిన ఐదేళ్లలో నేరమయ రాజకీయ నేపథ్యం ఉన్నవారి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతటి నష్టాన్ని చవిచూసిందో, దానిప్రభావం నుంచి నేటికీ బయటపడలేక ప్రజలు ఏవిధంగా బాధలు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అవినీతి, దోపిడీలకు పాల్పడటం.. తమను ప్రశ్నించిన వారికి భూమ్మీద స్థానం లేకుండా చేయడం, తమ నేరప్రవృత్తిని, దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి పార్టీలు, వ్యక్తులపై ఎదురుదాడి చేయడం, దుష్ప్రచారం చేసి బురదజల్లడం వంటి నీతిమాలిన రాజకీయాలను ప్రజలు స్వయంగా చూశారు. అన్నీ మౌనంగా భరించి, చివరకు వారికి అవకాశం రాగానే ఓటు అనే ఆయుధంతో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రాజకీయ విషనాగుల్ని తరిమికొట్టారు.


జగన్ రెడ్డి పాలన అంతా విచ్చలవిడి అవినీతి… విశృంఖల దోపిడీలు తప్ప, ప్రజలకు పనికొచ్చే.. రాష్ట్రానికి ఉపకరించే ఒక్క పనీ జరగలేదు. గత పాలకులు అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని వంచించి అధికారం చేపట్టి, చివరకు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి, ప్రజల్ని అన్నిరకాలుగా పీల్చిపిప్పిచేశారనేది విజ్ఞులైనవారు కాదనలేని వాస్తవం. పవిత్రమైన తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యిని కల్తీచేశారని, ధనాశతో భక్తుల మనోభావాలతో ఆటలాడారని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినప్పుడు ఆయన వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి తప్పుపట్టారు. తన ప్రభుత్వంలో నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని, నెయ్యిసరఫరా టెండర్లు పారదర్శకంగానే నిర్వహించామని చెప్పుకున్నారు. నెయ్యికల్తీ అనేది చంద్రబాబు సృష్టించిన రాజకీయవ్యవహారంగా జగన్ అడ్డగోలుగా కొట్టిపారేశారు. మరిప్పుడు తాజాగా సీబీఐ నేత్రత్వంలోని సిట్ చేసిన అరెస్ట్ లపై జగన్ ఏం సమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం. ఏ.ఆర్ డెయిరీ తప్పుడు ధృవీకరణపత్రాలతో టెండర్లు కొట్టేసి, అవసరమైన నెయ్యిని సరఫరాచేసే సామర్థ్యం తమకు లేకపోయినా ఉన్నట్టు నాటి జగన్ ప్రభుత్వాన్ని నమ్మించి టెండర్లు దక్కించుకున్నట్లు తేలింది. రూర్కీ (ఉత్తరాఖండ్) లోని భోలేబాబా డెయిరీ నుంచి ప్రారంభమైన కల్తీనెయ్యి కథ బోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ డైరెక్టర్లు విపిన్‌ జైన్‌, పోమిల్‌ జైన్‌లతో పాటు, తిరుపతి జిల్లా పెనుమాకలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావ్దా, తమిళనాడులోని దిండిగల్‌లో ఏఆర్‌ డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజు రాజశేఖరన్‌ ల అరెస్ట్ లవరకు చేరింది. తీగలాగితే డొంక కదిలినట్టు నెయ్యి కల్తీ వెనకున్న ప్రతి ఒక్కరి గుట్టు రట్టు కానుంది. ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వంలోని టీటీడీ పెద్దలతో పాటు, అధికారుల పాత్ర ఎంతనేది విచారణలో తేలుతుంది. కల్తీ నెయ్యి దొంగలే కాదు.. అడవుల ఆక్రమణదారులు.. మద్యం మాఫియా ఆగడాలు కూడా అతిత్వరలోనే బయటకు వస్తాయి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.