
మార్చి 17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర..!!
17, 18వ తేదీల్లో బీసీ, ఎస్సీ బిల్లులకు ఆమోదముద్ర.. 19న బడ్జెట్
24, 25, 26వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ
27న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిరవధిక వాయిదా
బీఏసీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నిర్ణయం
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. 19వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మీటింగ్కు సీఎం రేవంత్, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరుకావాల్సి ఉండగా, ఇద్దరూ అటెండ్ కాలేదు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ హాజరై సమావేశాల షెడ్యూల్పై చర్చించారు.
బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. 13,15వ తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ లో చర్చ ఉంటుంది. ప్రభుత్వం తరఫున సమాధానాలు ఉంటాయి. 14న హోలీ, 16న ఆదివారం సభకు బ్రేక్ ఉంటుంది. 17న బీసీ రిజర్వేషన్లపై బిల్ ప్రవేశపెట్టి చర్చ నిర్వహిస్తారు. దీనికి ప్రభుత్వం తరఫున సమాధానం ఉంటుంది. 18న ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం బీసీ, ఎస్సీ బిల్లులకు సభ ఆమోదం తెలపనున్నది. 19న బడ్జెట్ ప్రవేశపెట్టి 20న సెలవు ఇవ్వనున్నారు. ఈ నెల 21, 22న బడ్జెట్ పై చర్చ నిర్వహించి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. 24, 25, 26వ తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ చేసి 27న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపాక సభ నిరవధికంగా వాయిదా పడనున్నది.
బీఏసీ మీటింగ్కు హాజరుకాని రేవంత్, కేసీఆర్
కీలకమైన బీఏసీ మీటింగ్ కు సీఎం, ప్రతిపక్ష నేత హాజరు కావాల్సి ఉన్నా ఇద్దరూ రాలేదు. గవర్నర్ స్పీచ్ ముగిసిన తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో బీఏసీ మీటింగ్కు కేసీఆర్ వస్తారని భావించినా.. అసెంబ్లీ హాల్ నుంచి నేరుగా ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఈ సారి కేసీఆర్ అటెండ్ అవుతారని అనుకున్నామని, కానీ.. హాజరుకాకపోవడం ఆశ్చర్యపరిచిందని పలువురు మంత్రులతో పాటు బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఉన్నప్పటికీ బీఏసీ మీటింగ్ కు రాలేదు.
