
అందుకే కేటీఆర్ చంద్రబాబుకు దగ్గరవుతున్నారు
హైదరాబాద్: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకి మాజీమంత్రి కేటీఆర్ వల వేస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమికి దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే కేటీఆర్ చంద్రబాబు గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడారు. కనీసం కేసీఆర్ కుటుంబం నుంచి కాకుండా వేరే వెలమనైనా బీఆర్ఎస్ అధ్యక్షుడిని చేయగలరా అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు.
కేటీఆర్‌కి దమ్ముంటే పార్టీ అధ్యక్ష పదవి తీసుకొని బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. అధ్యక్ష పదవి చేపట్టిన రెండు సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటో, నాన్ వర్కింగ్ ప్రెసిడెంటో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. 25 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకా.. టీఆర్ఎస్ పార్టీకా అని నిలదీశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండేళ్లు అయిందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ కొడుకు విలన్ అయ్యారని.. బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అయితే పార్టీ ఓనర్ కొడుకు కేటీఆర్ విలనా అని సెటైర్లు గుప్పించారు. కమలం పువ్వు కాడికి గులాబీ పువ్వును అంటగడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తాము వేర్వేరు కాదని కేటీఆర్ ఇప్పుడు ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకి తమకు సారూప్యత ఉందని కేటీఆర్ చెప్పడం లేదా అని నిలదీశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్ హ్యాండిల్స్ నుంచి ఫొటోలు ఎందుకు డిలీట్ చేస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రశ్నల వర్షం కురిపించారు..
