TEJA NEWS

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం.. కేసులు నమోదు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌(ఎస్జీ) తుషార్‌ మెహతా తన వాదనలు వినిపించారు. సీబీఐకి కేంద్రానికి సంబంధం లేదన్నారు.

సీబీఐపై నియంత్రణ కేంద్రం దగ్గర ఉండదు. నేర నమోదు, కేసు విచారణ, అభియోగపత్రం మూసివేత, శిక్ష, విడుదల.. వీటిలో వేటినీ ప్రభుత్వం పర్యవేక్షించదు’’ అని మెహతా తెలిపారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచ్చిన సాధారణ సమ్మతిని బెంగాల్‌ ప్రభుత్వం 2018 నవంబర్‌ 16న ఉపసంహరించుకుంది. దీనితో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్‌ లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్‌ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్‌ లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వం నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

రాష్ట్రం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌… ఎస్జీ వాదనలను తోసిపుచ్చారు. కేంద్రపరిధిలోనే సీబీఐ ఉంటుందని డీఎస్‌పీఈ చట్టంలోని సెక్షన్లను ఉటంకించారు. పార్లమెంటులో కూడా సీబీఐ ప్రశ్నలు అడిగినపుడు సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖే సమాధానం చెబుతుందని అన్నారు. డీఎస్‌పీఈలో సెక్షన్‌ 6ని పేర్కొంటూ… ఒక్కసారి రాష్ట్రం సాధారణ సమ్మతి ఉపసంహరించుకుంటే సీబీఐకి అడుగుపెట్టే అధికారం ఉండదని అన్నారు. ‘‘ఇప్పుడు ఏం జరుగుతోందంటే.. సీబీఐని అడుగుపెట్టనిస్తే వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రవేశిస్తోంది. ఈ ధోరణితో దేశ రాజకీయాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి’’ అని సిబల్‌ తెలిపారు. ఈ కేసులో తదుపరి వాదనలు ఈ నెల 9న ధర్మాసనం విననుంది.


TEJA NEWS