
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెంచుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇళ్లకు వస్తున్న కరెంట్ బిల్లులు భయపెడుతున్నాయని, మరోసారి ధరలు పెంచితే ఎలాగంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.
ఈ మేరకు ఆయన కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఛార్జీలను పెంచే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. కావాలనే కొందరు యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలని మంత్రి మండిపడ్డారు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రెనేబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశామన్నారు. పీక్ అవర్స్‌లోనూ రూ. 4.60లకు విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం కుదిరిందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి కోరారు.
