ఆ బిగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం భరోసా !
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అనుమతులు తీసుకున్న ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బందులుండవని తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన మ్యాపుల్లో చాలాపెద్ద ప్రాజెక్టులు చెరువు స్థలాల్లో ఉన్నట్లుగా చూపారు. దాంతో అనేక మంది ఉలిక్కి పడ్డారు. కానీ ఆ తర్వాత అనుమతులు ఉన్న వాటికి ఎలాంటి సమస్యలు రావని ప్రభుత్వం నుంచి వరుసగా భరోసాలు లభిస్తున్నాయి.
నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని.. హైదరాబాద్ అభివృద్ధిలో బిల్డర్లు భాగస్వామ్యులని తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. . హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించేందుకు ప్రభుత్వంతో పాటు బిల్డర్లు కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్మాణ రంగంఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ నిర్మాణ రంగానికి చెందిన సంఘాలన్నీ కలిసి కట్టుగా ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. సమస్యల జాబితాను సిద్ధం చేస్తే.. నెలకు ఒకట్రెండు సార్లు సమావేశమై.. ఆయా ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్.. ప్రో యాక్టివ్, ఇంటరాక్టివ్, ఫ్రెండ్లీ, డెమెక్రటిక్, బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. బిల్డర్లతో కలిసి హైదరాబాదాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళతామనని ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దన్నారు.
కస్టమర్లు, బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన పనే లేదు. బిల్డర్లంతా నిశ్చింతగా తమ నిర్మాణ పనుల మీద దృష్టి సారించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. మంత్రుల మాటలు రియల్టర్లలో ధైర్యం నింపుతున్నాయి. ఆ దిశగా అధికారికంగా భరోసా లభిస్తే రియల్ రంగం మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.