TEJA NEWS

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్‌ కాలేజీతో తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు 60 బీఎస్సీ నర్సింగ్‌, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య, నర్సింగ్‌, ఫిజియోథెరపీ కళాశాలలతోపాటు 220 పడకల బోధనాసుపత్రి నిర్మాణం కోసం రూ.224.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య కళాశాల భవనాలను రూ.124.5 కోట్లతో, నర్సింగ్‌ కాలేజీ భవనాలను రూ.46 కోట్లతో, ఫిజియోథెరపీ కళాశాల భవనాలను రూ.27 కోట్లతో రహదారులు, భవనాల శాఖ నిర్మించనుంది. 220 పడకల ఆసుపత్రిని రూ.27 కోట్లతో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ నిర్మిస్తుంది. విద్యార్థుల కోసం పూర్తిస్థాయిలో హాస్టళ్లు నిర్మించనున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఎంఈ, ఇతర విభాగాధిపతులను వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కొడంగల్‌లో నాలుగు కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.


TEJA NEWS