TEJA NEWS

ఈవీయంలు అత్యంత సురక్షితమైనవిగా సుప్రీంకోర్టు తీర్పు:జిల్లా ఎన్నికల అధికారి.. బి. ఎం. సంతోష్

గద్వాల *:- భారతదేశంలో ఎన్నికల నిర్వహణకు వినియోగించే ఈవీయంలు అత్యంత సురక్షితమైనవిగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవియంలను ట్యాంపరింగ్ చేయొచ్చని పేర్కొంటూ మళ్ళీ బ్యాలెట్ పేపర్లకు అమల్లోకి తేవాలని కోరుతూ కొందరు వ్యక్తులు ఇటీవల సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని, పీల్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును కొట్టి వేస్తున్నట్టు తీర్పులు వెలువరించారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్,
పి.బి. వరాలే ఈ అంశంపై విచారణ జరిపిన అనంతరం పిటిషన్ ను కొట్టివేస్తూ సంచలన తీర్పును వెలువరించారన్నారు. నాయకులు ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అని చెప్పడం, ఓటమి పాలైనప్పుడు మాత్రం ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తపరచడం సరికాదని న్యాయస్థానం పేర్కొన్నట్లు తెలియజేశారు. ఈ తీర్పు ఈవీఎంల విశ్వాసనీయతకు మద్దతుగా, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందనడానికి రుజువుగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. ఓటర్లు అందరూ ఎన్నికల ప్రక్రియ, భారత ఎన్నికల సంఘంపై నమ్మకం కలిగి ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించే ఎన్నికలలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు.


TEJA NEWS