బుగ్గారం జి.పి.పై వరుసగా రెండు రోజులు విచారణ
పొంతన లేని అబద్ధపు సమాచారంతో హాజరైన అధికారులు
ఆగ్రహించిన “లోకాయుక్త”
రికవరీ సొమ్మును కూడా కాజేస్తున్నారా….?
రికవరీ మొత్తం ఎందుకు చూపెట్టలేదని “మొట్టి కాయలు వేసిన లోకాయుక్త”
క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని మందలింపు
ఫిర్యాదులన్నిటిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహించిన “లోకాయుక్త”
విజిలెన్స్ విచారణకు – లోకాయుక్త కేసు కు సంబంధం ఏమిటని ప్రశ్న
పూర్తి చర్యల సరైన సమాచారంతో రావాలని ఆదేశాలు
డిసెంబర్ ఆరుకు కేసు విచారణ వాయిదా
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం అనే అభియోగం పై లోకాయుక్త లో గురు – శుక్ర వారాలు వరుసగా రెండు రోజుల పాటు విచారణ జరిగింది.
ఈ విచారణలో పిర్యాదు దారుడు చుక్క గంగారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి (డీఆర్ డిఎ – పిడి), యం.రఘు వరన్ కార్యాలయ అసిస్టెంట్ ఉద్యోగులు అల్లె రాజేందర్, కొలగాని మురళి, బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా, ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి అక్బర్ లు లోకాయుక్త కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిర్యాదు దారుడైన ప్రముఖ ఉద్యమ కారుడు, సామాజిక కార్యకర్త చుక్క గంగారెడ్డి శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జిల్లా పంచాయతీ అధికారుల తప్పుడు సమాచారం పై “లోకాయుక్త” తీవ్రంగా ఆగ్రహించి అధికారులకు చీవాట్లు పెట్టింది. లక్షల రూపాయలు రికవరీ చేసి కూడా
సరైన సమయంలో చర్యలు ఎందుకు తీసుకోలేదని మొట్టికాయలు వేసింది.
బాధ్యులపై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని జిల్లా పంచాయతీ అధికారులను లోకాయుక్త గట్టిగా మందలించింది. రికవరీ చేసిన సొమ్మును కూడా కాజేస్తున్నారా….? మొత్తం రికవరీ సొమ్మును మాకు ఇచ్చిన సమాచారంలో ఎందుకు నమోదు చేయలేదని, పిర్యాదు దారుని వద్ద రికవరీ చలాన్ లు ఉన్నాయి కదా అంటూ.. లోకాయుక్త సీరియస్ గా జిల్లా పంచాయతీ అధికారులపై మండిపడింది.
విజిలెన్స్ విచారణకు – లోకాయుక్త కేసుకు సంబంధం ఏమిటని ఆ విచారణకు ఆటంకాలు ఎందుకు ఉన్నాయని లోకాయుక్త ప్రశ్నించింది. ఒక గ్రామ పంచాయతీ పై వచ్చిన పిర్యాదుల విచారణ నాలుగేండ్లు గడిచినా పూర్తి కాలేదంటే ఇక మిగతా గ్రామ పంచాయతీల పరిస్థితి ఏమిటనీ, మిగతా పిర్యాదుల సంగతేమిటని లోకాయుక్త జిల్లా పంచాయతీ అధికారులను ప్రశ్నించింది. అధికారుల నుండి ఎలాంటి సమాధానం లేదు. గురువారమే జిల్లా పంచాయతీ అధికారి యం.రఘు వరణ్ లోకాయుక్త విచారణ కు హాజరు కావలసి ఉండగా ఆయన స్థానంలో బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ మియా ను పంపించారు. అఫ్జల్ మియా సరైన సమాధానం లోకాయుక్త కు తెలుపక పోవడంతో పాటు అసంపూర్తి, పొంతన లేని అబద్దపు సమాదానంతో లోకాయుక్త కు హాజరు అయ్యారు. పొంతన లేని, అసంపూర్తి, అబద్ధపు సమాచారంతో ఎందుకు వచ్చావని ఎంపివొ అఫ్జల్ మియా కు లోకాయుక్త ద్వారా మొట్టి కాయలు, చీవాట్లు తగిలాయి. విచారణకు మీ డిపివో హాజరు కావాల్సిందేనని రేపే అనగా శుక్రవారమే ఆయన హాజరు కావాలని, ఆయనను రేపే పంపించండని లోకాయుక్త ఆదేశించింది. లోకాయుక్త ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితిలో డీపీఓ యం.రఘు వరణ్ కార్యాలయ సిబ్బందితో లోకాయుక్త కు
హాజరయ్యారు. ఆయన కూడా పొంతనలేని అబద్దపు సమాచారం, అసంపూర్తి సమాచారంతో లోకాయుక్త కు హాజరు అయ్యారు. డిపివొ పై కూడా లోకాయుక్త మండిపడింది. తీవ్ర ఆగ్రహంతో మొట్టి కాయలు వేసి, చీవాట్లు కూడా పెట్టింది.
బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో చేపట్టిన పూర్తి విచారణ, తీసుకున్న చర్యల పూర్తి సమాచారంతో వారానికే రావాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. కేసు తుది విచారణను డిసెంబర్ ఆరుకు
వాయిదా వేసింది.