కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

TEJA NEWS

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా బదిలీలు చేయాల్సి ఉంది. చాలారోజుల క్రితమే కసరత్తు చేసినప్పటికీ మార్పులు మాత్రం జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పైస్థాయిలో అధికారులను చాలావరకూ మార్చిన సంగతి తెలిసిందే. కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు తదితరులను కూడా చాలావరకూ బదిలీ చేశారు. అంతకంటే కింది స్థాయిలో పనిచేస్తున్న అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐ, ఎస్సైలను కూడా పెద్దఎత్తున మార్చుతారనే ప్రచారం జరిగింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది అధికారులు గత పదేళ్ల కాలంలో వరుసగా అనేక క్షేత్రస్థాయి పోస్టులలో పనిచేయగా కొందరికి మాత్రం ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా దక్కలేదు. ఇటువంటి వాటిని సరిదిద్దుతామని అధికారులు కూడా హామీ ఇచ్చారు. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని బదిలీలు వివాదాస్పదమయ్యాయి. బాధ్యతలు చేపట్టి సంవత్సరం కూడా కాకముందే చాలామందిని మార్చారు. ఇలా మధ్యలోనే బదిలీ అయి వెళ్లిపోయిన వారికి కూడా మళ్లీ పాత పోస్టులు ఇస్తారని భావించారు. మరో రెండు నెలల్లో రాబోతున్న పార్లమెంటు ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో కాంగ్రెస్‌ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న వారితో ఎన్నికలకు వెళ్లడం వారికి ఇష్టం లేదు. అందుకే నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి పనిచేస్తున్న వారితోపాటు సంతృప్తికరమైన పనితీరు కనబరచని వారిని మార్చాలని అధికారులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి పరిధిలోకి వచ్చేవారిని కూడా గుర్తించి మార్చాల్సి ఉంటుంది. వాస్తవానికి గత నెల చివరి వారంలోనే భారీ స్థాయిలో బదిలీలు జరుగుతాయని భావించారు. కాని ఆ ఊసే లేదు. దాంతో అసలు జరుగుతాయా? జరిగితే పరిమితంగా కొంతమందినే మార్చుతారా? మూకుమ్మడిగా బదిలీ చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS