TEJA NEWS

స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఆలోచించాలి..

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఉమ్మడి ఖమ్మం

స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా ఆలోచన చేసి, యూనిట్లను లాభదాయకం చేయడానికి చర్చించుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్, తల్లాడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్రింద ఏర్పాటుచేసిన దేవహత్రేయ ఫ్యాన్సీ జనరల్ స్టోర్ ను ప్రారంభించారు.

జనరల్ స్టోర్ ప్రోప్రయిటర్ దేవసుధ ని స్టోర్ లో ఏమేం అందుబాటులో ఉంచారు, ఎంత ఋణం తీసుకున్నారు, ఇదివరకు వ్యాపార అనుభవం తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాంతంలో డిమాండ్ ఉన్న వస్తువుల అమ్మకం చేయాలని, వినియోగదారునికి అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ అన్నారు. వ్యాపార అభివృద్ధి కి ఇంకనూ చేయాల్సిన పనుల గురించి ఆడిగారు. లాభదాయకంగా స్టోర్ నడిచేలా అధికారులచే అందాల్సిన సహాయ సహకారాలు అందుతాయన్నారు.

అనంతరం తల్లాడ మండలం అంజనాపురం గ్రామాన్ని కలెక్టర్ సందర్శించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కూర్చొని మాట్లాడారు. వెదురుతో చాటలు, బుట్టలు, చేతి విసనకర్ర, అలంకరణ సామాగ్రి తయారీని పరిశీలించారు. మేదరి వృత్తిలో ఉన్నవారి గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమేం వస్తువులు తయారు చేస్తుంది, తయారీకి సమయం, ఖర్చు, ఇంతకు అమ్ముతున్నది, ఎక్కడ అమ్ముతున్నది అడిగి తెలుసుకున్నారు. తయారీకి ఖర్చు కంటే తక్కువ ధరకు అమ్మడం గ్రహించి, మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మితే లాభం వస్తుందని, ఇందుకు షెడ్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఖమ్మం టిటిడిసి సమీపంలో డ్వాక్రా బజార్ త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు, ఇట్టి ఉత్పత్తులను డ్వాక్రా బజార్ లో నేరుగా అమ్ముకుంటే లాభదాయకంగా ఉంటుందని కలెక్టర్ అన్నారు.

ఖమ్మం బ్రాండ్ ఏర్పాటు చేస్తామని, ఖమ్మం లో ఉత్పత్తులకు మేడ్ ఇన్ ఖమ్మం అని, ఖమ్మం బ్రాండ్ ప్రచారం చేస్తామని కలెక్టర్ అన్నారు. మహిళా శక్తి ద్వారా యూనిట్ల స్థాపనే కాక, స్థాపించిన యూనిట్లు లాభదాయకంగా నడిచేలా ప్రణాళిక చేస్తామన్నారు.

మహిళలతో గ్రామాల్లో ఇబ్బందులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుకు ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే దరఖాస్తులు స్వీకరించి అర్హులకు అందజేస్తామన్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. పాఠశాలలో ఇంకనూ అవసరం అయితే టీచర్లను ఏర్పాటుచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో ఎస్. సన్యాసయ్య, తల్లాడ ఎంపిడివో చంద్రమౌళి, డిపిఎం లు దర్గయ్య, శ్రీనివాస్, గ్రామ దీపిక విజయలక్ష్మి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS