ఇంజక్షన్లు వికటించి 17 మంది రోగులకు అస్వస్థత
అనకాపల్లి : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఉన్న 50 పడకల
ప్రభుత్వాస్పత్రిలో రాత్రి ఇంజక్షన్‌లు వికటించడంతో పలువురు రోగులు అస్వస్థతకు గురయ్యారు.
నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని పలు గ్రామాల కు చెందిన రోగులు,బాలింతలు రెండు మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు. రాత్రి విధుల్లో ఉన్న వైద్యురాలు జయలక్ష్మి ఆధ్వర్యంలో నర్సులు వీరికి ఇంజక్షన్లు ఇచ్చారు.
కాసేపటికే పై అంతస్తులో చికిత్స పొందుతున్న రోగులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరికి చలి జ్వరం వచ్చింది. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
విషయం తెలుసుకున్న వైద్యాధికారి వీరందరికీ విరుగుడు మందులు ఇస్తూనే పోలీసులు, ఉన్నతాధికారులకు తెలియజేశారు. రోగుల సహాయకులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఆందోళన నెలకొంది.
హోం మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్‌తో మాట్లాడారు. చివరకు అంబులెన్స్‌ల్లో 17 మందిని అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు.
బాధితుల్లో సింహాద్రి అనే రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యాధికారి తెలిపారు. ఇంజక్షన్లు వికటించడంపై ఉన్నత
అధికారులు విచారణ ప్రారంభించారు..