TEJA NEWS

పోతవరంలో 24 వ తేదీ అబ్దుల్లా బాషా ఉరుసు

చిలకలూరిపేట మండలం పోతవరం గ్రామంలో వేంచేసి ఉన్న మౌలానా మౌల్వీ మహమ్మద్ అబ్దుల్లా భాష బాబా 73 వఉరుసు అబ్దుల్ ఖుద్దుస్ ఆధ్వర్యంలో నవంబర్ 24 వ తేదీ ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది.
25వ తేదీ సోమవారం దీపరాధనలు జరుగును.

ఉరుసు రోజు అన్నదానం

ఉరుసు రోజు 24 వ తేదీ ఆదివారం రాత్రి 7 లకు జర్నలిస్ట్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరుగును. అన్న దాన కార్యక్రమాన్ని చిలకలూరిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, వెంకట కుమారి లు ప్రారంభించనున్నారు.

మౌలానా మౌల్వీ మొహమ్మద్ అబ్దుల్లా భాష బాబా జీవిత చరిత్రను ఒకసారి తెలుసుకుందాం.

అబ్దుల్లా భాష జన్మస్థలం, బాల్యం, చదువు…

మౌలానా మౌల్వీ మహమ్మద్ అబ్దుల్లా భాష తమిళనాడు రాష్ట్రం ఉత్తర ఆర్కాట్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన రాయవేలూరులో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఈయనకు మహమ్మద్ అబ్దుల్లా భాషగా నామకరణం చేశారు. వీరు ఉర్దూ భాషతో పాటు తెలుగు భాష కూడా నేర్చుకున్నారు. బాకీయా తుష్ సలాక్ అను పేరుగల కాలేజీలో చేరి పండిట్ కోర్సును పూర్తి చేసి మౌల్వీ పట్టాను పొందారు. మారిఫథ్ నయీగజల్ అను పేరు గల పుస్తకమును వ్రాసి వీరు ఉర్దూ కవుల వద్ద ఖాదరిష్య జలియా అను బిరుదును పొందిరి. అబ్దుల్లా భాషకు 40 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి మనసులో స్వాతంత్ర భావజాలం నాటుకొని జాతీయ నాయకుల ఉపన్యాసాలు విని, వారు ఒకసారి అబ్దుల్ కలాం ఆజాద్ వెంట వెళ్లి కాంగ్రెస్ మహాసభలో ఉపన్యసించారు. అనంతరం జాతీయ నాయకులతో కలిసి అనేక మార్లు సత్యాగ్రహంలో పాల్గొని జైలులో సైతం బంధించబడ్డారు.

మహమ్మద్ అబ్దుల్లా భాష పోతవరం వచ్చిన విధానం…

గుంటూరు జిల్లా నర్సారావుపేట తాలూకా పోతవరం గ్రామంలో నివసిస్తున్న అనేక మంది నరసరావుపేట వెళ్ళినప్పుడు మహమ్మద్ అబ్దుల్లా భాషను చూసి పోతవరం గ్రామస్తులకు విద్య ఆధ్యాత్మిక భావం లేదని తమ పిల్లలకు విద్యాబుద్ధులు, ఆధ్యాత్మిక నేర్పించాలని కోరి ఆయనను గ్రామానికి ఆహ్వానించారు. పోతవరం గ్రామంలో వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి మసీదును నిర్మించి నమాజ్ చేయిస్తూ ఉండేవారు. అలానే గ్రామస్తులు ఆయనకు ఇప్పుడు దర్గా ఉన్న స్థలంలో ఇల్లును నిర్మించి ఇచ్చారు.

అబ్దుల్ల భాషా వైద్యం చేసే విధానం…

అబ్దుల్లా భాష వనమూలికలతో తయారుచేయబడిన మాత్రలు ఇచ్చి జబ్బులు నయం చేసేవారు. రోగుల వద్ద నుండి నయాపైసా తీసుకునేవారు కాదు. ఆయన ప్రతిష్ట నానాటికీ పెరుగుతూ ఉండేది. కుల మత భేదం లేకుండా అందరికీ వైద్యం చేసేవారు. అలానే భూతవైద్యం కూడా చేసి వారిని బాధల నుంచి విముక్తులను చేసేవారు.

అబ్దుల్ భాష మహిమలు..

అబ్దుల్లా భాష వద్ద ఎంతో మంది శిష్యులు చేరి ఆయన వద్ద శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఒకరోజు అబ్దుల్లా భాషతో వారి శిష్యులు తమ యొక్క మహిమలను చూపించమని కోరారు. అప్పుడు అబ్దుల్లా భాష వారి శిష్యులను వెంటబెట్టుకొని ఊరి వెలుపల ఉన్న ఓగేరు వాగు వద్దకు తీసుకుపోయారు. అక్కడ నుంచి కొంత ఇసుక తీసుకుని మంత్రించి చల్లారు.. అప్పుడు గర్జించే సింహాలు పెద్ద పులులు వికట్ట హాసం చేస్తూ వారి వైపు వచ్చాయి. అంతట భయకంపితులైన శిష్యులు గురువుని శరణు కోరగా ఇసుక మంత్రించి చల్లగా అవి అదృశ్యమైపోయాయి.

అబ్దుల్లా భాష పరదా అగుట…

అబ్దుల్లా భాష వారి శిష్యుల వద్ద తాను 1953వ సంవత్సరంలో రబ్బీ లవల్ మాసంలో శనివారం పగలు 2:00కు తుదిశ్వాస విడిచెదనని చెప్పారు. సరిగ్గా అదే సమయంలో వారు తుదిశ్వాస విడిచారు. 40 రోజుల అనంతరం ఆయన సమాధిపై బండ తొలగించి చూడగా దేహం చెక్కుచెదరక సుగంధద్రవ్యాల వాసనతో అందర్నీ ఆశ్చర్య పరిచింది.

అబ్దుల్లా భాష బాబాకు దర్గా కట్టిన విధానం…

అబ్దుల్లా భాష బాబాకు ఆయన శిష్యులు కొంతమంది కలిసి ఆయనకు దర్గాను ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఉర్దూ నెల ప్రకారం 1953 నుండి క్రమం తప్పకుండా వారి వారసులు గంధమహోత్సవంను చేస్తూ ఉన్నారు.

ఆయన యొక్క దర్గా వద్దకు ప్రతి శుక్రవారం, ఆదివారం భక్తులు చేరుకొని వారి మొక్కులు తీరుస్తూ ఉండేవారు. కోరుకున్న భక్తులకు కొంగు బంగారంగా వారి కోరికలు బాబా తీరుస్తున్నారు. కోర్కెలు తీరిన అనంతరం వివిధ జిల్లాల నుండి ఆయన భక్తులు దర్గాకు విచ్చేస్తుంటారు.


TEJA NEWS