ప్రజలకు స్థానికంగానే అందుబాటులో కావాల్సినంత ఇసుక: ప్రత్తిపాటి పుల్లారావు
కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానంతో ప్రజలందరికీ స్థానికంగానే కావాల్సినంత ఇసుక అందించే అవకాశం లభించిందని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వైకాపా హయాంలో ట్రక్కుకు రూ.20 వేలు ఆ పైన కూడా పెట్టిన పరిస్థితుల నుంచి నామమాత్రపు ధరకే ఇసుక అందిస్తుండడం సామాన్య, మధ్యతరగతికి అతిపెద్ద ఊరటగా పేర్కొన్నారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన పల్నాడు జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో మొత్తం ఆరు చోట్ల ఇసుక సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటి వివరాలు వెల్లడించారు. వైకుంఠపురం, కోనూరు, కొత్తపల్లి, మాదిపాడు, వినుకొండ, కొండమోడు స్టాక్ యార్డుల్లో సరఫరాకు నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు ప్రత్తిపాటి. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయించిన ధరలు మాత్రమే చెల్లించి కోటా మేరకు ఇసుక తీసుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు. అయిదే ళ్లుగా జగన్రెడ్డి అమలు చేసిన దుర్మార్గపు విధానాలు రద్దు చేయడం ద్వారానే ఇది సాధ్యమైంద న్నారు. ఇకపై దళారీలకు వేల రూపాయలు కప్పం కట్టాల్సిన పనిలేదని, ఇసుక దొరుకుతుందో లేదో, ఇంటి పనులుకు ముందుకు సాగుతాయో లేదో అన్న భయాలు ఇక అవసరం లేదన్నారు ప్రత్తిపాటి. దీనిద్వారా భవననిర్మాణ కార్మికులు, ఆ రంగంపై ఆధారపడిన ఇతర విభాగాల వారు ఉపాధి, వ్యాపార అవకాశాల విషయంలో బెంగ పెట్టుకోవక్కర్లేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుని అందరికీ ఊరటనిచ్చిన ముఖ్య మంత్రికి ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు.