TEJA NEWS

జీసస్ ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలి.

మంగళగిరి నిర్మలా కళాశాల సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్.

ఏసుక్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి సమీపం ఆత్మకూరులోని నిర్మల ఫార్మశీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. సిస్టర్స్ నన్ను కలిసినప్పుడు నాకు చిన్నప్పటి పాఠశాల రోజులు గుర్తుకువచ్చాయి. అప్పుడు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణ. మనమేంటో ఇతరులకు తెలియజెప్పడం. ప్రతిఒక్కరి పట్ల ప్రేమ, శాంతిని కలిగి ఉండాలని జీసస్ బోధించారు. 2019 నుంచి మంగళగిరిలో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అప్పటి ఎన్నికల్లో ఓటమి చెందాను. ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్నాను. ఎన్ని ఓటములు ఎదురైనా మనోధైర్యాన్ని కోల్పోకూడదు. వైఫల్యం విజయానికి సోపానం. అందుకు నేనే ఉదాహరణ. దేవుడు మనకు అనేక పరీక్షలు పెడతాడు. వాటన్నింటిని కృషి, పట్టుదల, కఠోర శ్రమతో అధిగమించాలి. దేవుడు ప్రతిఒక్కరికి శక్తినిస్తాడు. మన గురించి కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించాలి. దేశానికి నువ్వేమి చేశావని గుర్తుంచుకోవాలి. వందేళ్ల స్వతంత్ర భారత్ దిశగా పయనిస్తున్న సమయంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు యువత తమవంతు బాధ్యత వహించాలి. మా కుటుంబంలో కూడా క్రిస్మస్ తో పాటు అన్ని పండుగలను జరుపుకుంటాం. ప్రతిఒక్కరు ఇతరుల పట్ల సహనంతో వ్యవహరించి మన సంప్రదాయాలను ముందుకుతీసుకెళ్లాలన్నారు.

నిర్మల ఫార్మశీ కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకులు ఆద్యంతం ఆహ్లాదభరిత వాతావరణంలో కొనసాగాయి. ముందుకు కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు నిర్వాహకులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ప్రార్థనా గీతంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అకడమిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి లోకేష్ ను శాలువా, మెమెంటోతో కళాశాల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్, ఆంధ్ర లయోల కాలేజీ ఎస్ జె ఫౌండర్, డైరెక్టర్ బాల బొల్లినేని, రివరెండ్ సిస్టర్, కళాశాల డైరెక్టర్ డాక్టర్ యు.షౌరీలు, రివరెండ్ సిస్టర్, కళాశాల కరస్పాండెంట్ జి. నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి.పాముల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS