యువత అభివృద్ధి కోసమే స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాలు
కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు
ఎమ్మెల్యే గొండు శంకర్
(శ్రీకాకుళం)
నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిందని కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నగరంలోని నాగావళి హోటల్‌లో ఎపీ స్టేట్ స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ ఆర్ కాంక్లేవ్ ప్రొగ్రామ్ మంగళవారం నిర్వహించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలోనే సమయం వృధా చేయకుండా ప్రతీ ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్త తయారు కావాలన్నదే సీఎం చంద్రబాబునాయుడు ఉద్దేశ్యమన్నారు.
యువత నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చునని తెలిపారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్, శ్రీకాకుళం జిల్లా తెలుగుయువత అధ్యక్షులు మెండ దాసునాయుడు, కూటమి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.