TEJA NEWS

ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు..!!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో ఉన్నారు. బుధవారం(అక్టోబర్ 23) కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. బ్రిక్స్ సమావేశం అనంతరం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తో సమావేమయ్యారు.

ఇద్దర మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఐదేళ్ల తర్వాత మోదీ, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరుగుతుండటం విశేషం. ఇరువురి మధ్య సరిహద్దు వివాదంతోపాటు పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

గతంలో 11 అక్టోబర్ 2019న ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు సమావేశమయ్యారు. ఆ తర్వాత తాజాగా రష్యాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ తమ మొదటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేప్సాంగ్ మైదాన ప్రాంతం, డెమ్‌చోక్ ప్రాంతంలో ఒకరికొకరు పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించుకోవడానికి భారత్ – చైనాలు అంగీకరించిన తర్వాత ఈ సమావేశం జరిగింది. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంఘర్షణను పరిష్కరించడానికి ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుంది.

తూర్పు లడఖ్‌లో చైనా చొరబాటు LAC వెంట సైనిక ప్రతిష్టంభనకు దారితీసే కొన్ని నెలల ముందు, అక్టోబర్ 2019లో మహాబలిపురంలో జరిగిన అనధికారిక శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నాయకులు కలుసుకున్నారు. 2022 బాలిలో, 2023 జోహన్నెస్‌బర్గ్‌లో కొన్ని సమావేశాలు జరిగినప్పటికీ, బుధవారం నాటి సమావేశం సరైన ద్వైపాక్షిక సమావేశంగా భావిస్తున్నారు. అయితే, నాలుగేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు ముగింపు పలకడంలో ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన భేటీ పెద్ద విజయమని నిపుణులు భావిస్తున్నారు.

2014 నుంచి 2019 మధ్య కాలంలో మోదీ, జిన్‌పింగ్‌లు 18 సార్లు భేటీ అయ్యారు. మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగిన సందర్భాలు ఇవి. జిన్‌పింగ్ 18 సెప్టెంబర్ 2014న భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ప్రధాని మోదీ 2015 మే 14న చైనా వెళ్లారు. G20 శిఖరాగ్ర సమావేశం 4-5 సెప్టెంబర్ 2016లో చైనాలో జరిగింది. ఇందులోనే ఇద్దరూ కలిశారు. దీని తర్వాత, 2017 జూన్ 8-9 తేదీలలో SCO సమావేశంలో ఇద్దరు నేతల మధ్య సమావేశం జరిగింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 26న చైనాలోని వుహాన్‌లో, 2019 అక్టోబర్ 11న మహాబలిపురంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు.


TEJA NEWS