TEJA NEWS

ఆంధ్రప్రదేశ్‌లో హింస చెలరేగడానికి చంద్రబాబు, పురందేశ్వరిల కుట్రలే ప్రధాన కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్‌ బూత్‌లను కైవసం చేసుకుని ఈవీఎంలను పగులకొట్టాలనే ఉద్దేశంలో దాడులు జరిగాయి.

టీడీపీ ఓడిపోతుందని తెలిసినప్పుడు చంద్రబాబు రాక్షస అవతారం ఎత్తుతారని విమర్శించారు. ఎన్నికల ముందు ఐపీఎస్‌ల మార్పుచేర్పులకు పురందేశ్వరితో చంద్రబాబు లేఖ రాయించారని విమర్శించారు.

అధికారులను మార్చినచోటే హింస చెలరేగడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ అపాయింట్‌ చేసిన వారే సస్పెండ్‌ అవడం చరిత్రలో ఎరుగని విడ్డూరమని విమర్శించారు.

చంద్రబాబు ఆదేశాలతోనే పురందేశ్వరి ఈసీకి లేఖ రాసి పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను మార్పు చేయించారు.

అధికారులను మార్చిన చోటే హింస చెలరేగింది. పల్నాడు జిల్లాలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున హింస జరిగింది.

కొత్త ఎస్పీ వస్తే ఎన్నికలు బలంగా.. ప్రశాంతంగా జరగాలి కదా..? మరి ఎందుకు హింస చెలరేగింది? ఈ మార్పులు చేర్పుల మీదనే అసలైన కుట్ర జరిగింది’ అని అంబటి ఆరోపించారు.

టీడీపీ తరఫున చంద్రబాబు, బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన పవన్‌కళ్యాణ్‌ కలిసి ఈ కుట్ర చేశారా..? ఎన్నికల కమిషన్‌కు పనిగట్టుకుని ఫిర్యాదులిచ్చి ఐపీఎస్‌లను మార్పులు చేర్పులు చేసి తమ తప్పుడు ఓట్లను వేయించుకోవాలనే గందరగోళంలోనే ఇంత హింస జరిగిందా..? అనే సందేహాలు రేకెత్తుతున్నాయి.

టీడీపీ, బీజేపీ, జనసేన హింసకు పాల్పడ్డారనే అనుమానం కలుగుతుంది. ఎన్నికల కమిషన్‌ నియమించిన ఐపీఎస్‌ అధికారులనే సస్పెండ్‌ చేసిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితిని చరిత్రలో ముందెన్నడూ చూడలేదు.’ అని అంబటి రాంబాబు అన్నారు.

చంద్రబాబు ఓడిపోతానని తెలిసిన రోజు చంద్రబాబు రాక్షసంగా క్రూరంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదని తెలిసినప్పుడు హింసను ప్రోత్సహిస్తాడు.

పోలింగ్‌ రోజున తలలు పగిలి పోలీసులకు సమాచారం ఇస్తే కనీసం అక్కడికి రాలేదు. ఇరువర్గాలు కొట్టుకుని అలసటతో వాళ్లే ఆగిపోయారు. అప్పటికే రెండు వర్గాల్లో చాలామందికి తలలు పగిలి రక్తం పారింది. ఇంత దారుణంగా ఫెయిల్యూర్‌ అయిన పోలీస్ వ్యవస్థను చరిత్రలో చూడలేదు.’ అని ధ్వజమెత్తారు.

పోలీసు వ్యవస్థలో కిందిస్థాయి సిబ్బంది టీడీపీతో కుమ్మక్కయ్యారు. పోలీసుల సాయంతో టీడీపీ మూకలు వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో దాడులు, ఈవీఎంలను ధ్వంసం చేశారు.

ఈ దాడులు, అల్లర్లకు కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్‌ను, ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. ఎవరైతే, అవినీతికి పాల్పడ్డారో, విధుల్లో అలసత్వం ప్రదర్శించారో వారందరిపైన వేటు వేయాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.


TEJA NEWS