TEJA NEWS

పార్టీ లోకి రాకముందే వాసిరెడ్డి పద్మ కి పదవి ఫిక్స్ చేసిన చంద్రబాబు*

ఏ పీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీనికి ముహూర్తాన్ని కూడా ఖాయం చేసుకున్నారు.11 లేదా 12 తేదీన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.

తెలుగుదేశం పార్టీలో చేరనున్న విషయాన్ని వాసిరెడ్డి పద్మ స్వయంగా వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆమె విజయవాడలో టీడీపీకి చెందిన స్థానిక లోక్‌సభ సభ్యుడు కేశినేని చిన్నిని కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే వారం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు

ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్సీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతారహితంగా పని చేయడం వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందంటూ విమర్శించారు.

పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పట్ల చిన్నచూపు చూశారని ఆరోపించారు. పార్టీ, ప్రభుత్వాన్ని నడిపించడంలో జగన్ ఘోరంగా విఫలం అయ్యాడంటూ అప్పట్లో మండిపడ్డారు. రాజీనామా చేసిన తరువాత జనసేనలో చేరొచ్చంటూ తొలుత ప్రచారం సాగినప్పటికి అది వాస్తవ రూపాన్ని దాల్చలేదు. టీడీపీలో చేరాలని నిర్ణయించారు.

ఎన్టీఆర్ జిల్లాజగ్గయ్యపేట ఆమె సొంత నియోజకవర్గం. మొన్నటి ఎన్నికల్లో వైెఎస్ఆర్సీపీ టికెట్ ఆశించారు గానీ అది సాధ్యపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు టికెట్ ఇచ్చారు జగన్. అది విజయవంతం కాలేదు. ఈ ఎన్నికల్లో సామినేని ఓటమి చవి చూశారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీకీ గుడ్‌బై చెప్పారు. జనసేన కండువా కప్పుకొన్నారు.

దీనితో జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్‌ఛార్జీగా వాసిరెడ్డి పద్మను జగన్ అపాయింట్ చేస్తారనే ప్రచారం జరిగింది గానీ దీనికి భిన్నమైన నిర్ణయం తీసుకున్నారాయన. ఇన్‌ఛార్జ్ బాధ్యతలను తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించారు. దీనితో తీవ్ర అసంతృప్తికి గురైన వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారంటూ అప్పట్లో వార్తలొచ్చాయి.

చంద్రబాబు చేతుల మీదుగా పసుపు కండువా కప్పుకొన్న తరువాత ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. నామినేటెడ్ పదవిని కేటాయిస్తారని అంటున్నారు. శాసన మండలికి వెళ్లాలని పద్మ కోరుకుంటోన్నారని, ఇదే విషయాన్ని కేశినేని చిన్ని దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.


TEJA NEWS