TEJA NEWS

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే: నారా భువనేశ్వరి

చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మనిషే అని, కార్యకర్తలే మా కుటుంబమని అన్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. అక్రమ కేసులతో ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైల్లో నిర్భంధించి సాధించింది శూన్యమని ఆమె ప్రభుత్వానికి చురకలు వేశారు. ప్రజల సొమ్ము కాజేశారనే అభియోగాలు మోపి అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ఆరోపణలు చేసిన వారు కోర్టులకు చంద్రబాబు తప్పు చేసినట్లు ఒక్క ఆధారం కూడా ఎందుకు చూపించలేక పోయారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగాలు కల్పించాలని చంద్రబాబు పెద్దపెద్ద సంస్థలను తీసుకొచ్చారని తెలిపారు. దాంట్లో ఏదో తప్పు జరిగిందంటూ తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. కానీ చివరకు వారికి ఏం దొరకలేదన్నారు. అదే చంద్రబాబులో గొప్పతనమన్నారు భువనేశ్వరి. ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించే చంద్రబాబు ఏ రోజూ డబ్బు కోసం పని చేయలేదన్నారు. తమ కుటుంబసభ్యులు కూడా ఎప్పుడూ ప్రజల డబ్బును ఆశించలేదని.. ఆశించబోరు అని పేర్కొన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు కూడా తెదేపా బిడ్డల గురించే ఆలోచించేవారని గుర్తుచేశారు. కష్టాల్లో మాకు అండగా ఉన్న ప్రజలను, మరణించిన వారి కుటుంబాలను పలకరించాలనే నిజం గెలవాలి యాత్ర చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు జైలులో ఉన్న 53 రోజులు మహిళలు సహా ప్రతిఒక్కరూ పోరాటం చేశారని.. అది జీవితంలో మరిచి పోలేమని అన్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుతో మనోవేదనకు గురై మృతి చెందిన ఆ పార్టీ కార్యకర్త కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. యడ్లపాడుకు చెందిన తెదేపా కార్యకర్త మొగిలి సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబసభ్యుల యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొబైల్ అన్న క్యాంటీన్‌ను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా భోజనాలు అందించారు. ఈ కార్యక్రమానికి ముందుగా యడ్లపాడు వద్ద మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా తెదేపా అధ‌్యక్షుడు జీవీ ఆంజనేయులు భువనేశ్వరికి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. భువనేశ్వరి నేరుగా వచ్చి భరోసా కల్పించడం.. మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. స్థానికంగా ఉన్న మహిళలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నరసరావుపేట నియోజకవర్గంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి బయలుదేరి వెళ్లారు.

అడుగడుగునా అభిమానం
యడ్లపాడు పర్యటనకు వచ్చిన భువనేశ్వరికి పెద్ద ఎత్తున తెలుగు మహిళలు సంఘీభావం తెలిపారు. మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకటకుమారి ఆధ్వర్యంలో మహిళలు పెద్దఎత్తున భువనేశ్వరికి స్వాగతం పలికారు. పట్టణం, మండలాల నుంచి మహిళలు భారీగా తరలివెళ్లి భువనేశ్వరితో ఫొటోలు దిగుతూ సంతోషం వ్యక్తం చేశారు. భువనమ్మ.. మీకు మేమున్నాం.. ధైర్యంగా ఉండండి.. అంటూ భరోసా ఇచ్చారు.


TEJA NEWS