TEJA NEWS

బెల్టు షాపు పెడితే.. బెల్టు తీస్తా: చంద్రాబాబు మాస్ వార్నింగ్

ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానన్న చంద్రబాబు

వైసీపీ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందని విమర్శ

రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని వ్యాఖ్య

మద్యం అమ్మకాలు పారదర్శకంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం వైన్ షాపుల ద్వారా మాత్రమే అమ్మకాలు జరగాలని చెప్పారు. ఎవరైనా బెల్టు షాపులు పెడితే… వారి బెల్టు తీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. బెల్టు షాపులు లేకుండా స్థానిక ఎమ్మెల్యేలు చూసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా క్రైమ్ కు పాల్పడితే తాట తీస్తానని హెచ్చరించారు. అమ్మాయిలు, మహిళలపై సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే అదే వారికి ఆఖరి రోజు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాలుగు దశాబ్దాలుగా ప్రజలు తనను ఆదరించారని… ఎక్కువసార్లు ప్రజలు తనను సీఎం చేశారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని… జైలుకు కూడా పంపించారని అన్నారు. అధికారం ఉన్నా, లేకున్నా తాను ప్రజల కోసమే పని చేశానని చెప్పారు. వైసీపీ పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందని అన్నారు. కీలక సమయంలో ప్రజలు తమకు ఘన విజయం అందించారని చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా సాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్రం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోందని అన్నారు.

అధికారంలోకి రాగానే పెన్షన్లు రూ. 4 వేలకు పెంచామని చంద్రబాబు చెప్పారు. 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రూ. 10 లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పులను లెక్కలతో సహా అసెంబ్లీలో చూపించామని చెప్పారు. పేదలకు పక్కా ఇళ్లను నిర్మించిన ఘనత టీడీపీకే దక్కుతుందని అన్నారు


TEJA NEWS