TEJA NEWS

రేషన్ కార్డు లేని పేదలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. వీరందరికీ కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. డిసెంబరు 2 నుంచి 28వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.

అన్ని ప్రభుత్వ పథకాలు అందాలంటే కీలకమైన రేషన్ కార్డు కోసం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎదురు చూస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్నా.. వైకాపా ప్రభుత్వం మంజూరు చేయకుండా రిక్తహస్తం చూపింది.

ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి వరకూ చేసుకున్న దరఖాస్తులను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని నిర్ణయించారు. అన్నింటినీ పరిశీలించి అర్హులకు సంక్రాంతి కానుకగా అందిస్తారు.

మారనున్న డిజైన్లు

ప్రస్తుతం ఉన్న రేషన్కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు డిజైన్లను ఎంపిక చేసే కసరత్తు చేపడుతోంది. ఇది పూర్తయ్యాక కార్డులన్నీ ముద్రించి పంపిణీ చేయనున్నారు.

ప్రస్తుతం కార్డులు జగన్మోహన్రెడ్డి బొమ్మతో ఉన్నాయి. వీటిని సమూలంగా మార్చనున్నారు.
అనర్హుల ఏరివేత

వైకాపా ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల అర్హుల కార్డులు తొలగించి అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 8,62,839 రేషన్కార్డులు ఉండగా, ప్రతి నెలా దాదాపు 10% కార్డుదారులు రేషన్ తీసుకోవడం లేదని తేలింది. నవంబరులో విజయనగరం జిల్లాలో 9.53%, మన్యం జిల్లాలో 10.69% మంది రేషన్ అందుకోలేదని అధికారులు గుర్తించారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా గుర్తించేందుకు గ్రామసభలు ఏర్పాటు చేయనుంది.

ఉడాకాలనీ, న్యూస్టుడే: కొత్త రేషన్కార్డులు కావాలనుకునే వారు డిసెంబరు 2 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని డీఎస్వో మధుసూదనరావు ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 28 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. జనవరి 1 నుంచి మార్చి వరకు పరిశీలించి, అర్హులైన వారికి కార్డులు అందిస్తామన్నారు.


TEJA NEWS