యువ ప్రతిభతో తెలుగుచిత్ర పరిశ్రమలో నూతన ఉత్తేజం : మాజీమంత్రి ప్రత్తిపాటి
హైదరబాద్ లో ‘K-Ramp’ చిత్ర విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించి సన్మానించిన ప్రత్తిపాటి.
యువనటుడు కిరణ్ అబ్బవరం తన ప్రతిభాపాటవాలతో తెలుగుచిత్ర పరిశ్రమలో నూతనోత్సాహం నింపుతున్నారని, ఎందరో యువ హీరోహీరోయిన్ల రాకతో టాలీవుడ్ లో నూతన ఉత్తేజం కనిపిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాద్ దసపల్లా హోటల్లో జరిగిన ‘K-Ramp’ చిత్ర విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిథి హోదాలో హాజరైన ప్రత్తిపాటి.. చితృబృందాన్ని పేరుపేరునా అభినందించి తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వేడుకకు విచ్చేసిన అభిమానులు, సినీ ప్రేమికుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
‘K-Ramp’ సినిమాలో కథా బలంలేకున్నా దర్శకుడు నానీ తనదైన శైలిలో మంచి రొమాన్స్ తో కూడిన హాస్యాన్ని పొందుపరిచి యువతకు నచ్చే అంశాలు జోడించి, చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారని ప్రత్తిపాటి కొనియాడారు. నిర్మాతల్లో ఒకరైన దండా రాజేశ్ తమకు బంధువులైతే, మరొక నిర్మాత శివ బొమ్మక్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ బంధువని ప్రత్తిపాటి చెప్పారు. వారిద్దరూ ఇదే విధంగా భవిష్యత్ లో ప్రేక్షకులు మనసులు రంజింపచేసే చిత్రాలు తీయాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ను ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందిం చారు. అనంతరం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన నటీనటులు, సాంకేతిక బృందానికి ప్రత్తిపాటి జ్ఞాపికలు అందించి సత్కరించారు.
