నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది.
అంతకుముందు కోర్టులో వాదనలు కొనసాగాయి. జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా.. కస్టడీ పొడిగింపునకు కొత్త గ్రౌండ్స్ ఏమీ లేవని కవిత న్యాయవాది పేర్కొన్నారు. కస్టడీ ఎందుకు పొడిగించాలని కోరుతున్నారో అర్థం కావడం లేదన్నారు.
ఈ కేసు గురించి కవిత నేరుగా కోర్టులో మాట్లాడాలని కోరుకుంటున్నారని ధర్మాసనానికి తెలిపారు. 2 నిమిషాలు అనుమతి ఇవ్వాలని కవిత న్యాయవాది కోరగా.. నిందితులు మాట్లాడకూడదని ఎక్కడా లేదని ధర్మాసనం పేర్కొంది. దీనిపై అప్లికేషన్ ఇవ్వాలని సూచించింది. కోర్టులో మాట్లాడేందుకు అనుమతి కోరినప్పటికీ కోర్టు నిరాకరించింది.. గతంలో కేజ్రీవాల్ కు అనుమతి ఇచ్చిన న్యాయస్థానం.. కవితకు నిరాకరించింది. అయితే, జడ్జి అనుమతితో కోర్టులో భర్త అనిల్, మామ రామకిషన్ రావు కవితను కలిశారు.
తాను చెప్పాల్సింది చెప్పానని.. తనపై తప్పుడు కేసు పెట్టారని కవిత పేర్కొన్నారు. సీబీఐ అధికారులు కూడా తనను తీహార్ జైలులో ప్రశ్నించారని తెలిపారు