రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన
గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆహార భద్రత కోసం కేంద్రం అందించిన రూ.65 కోట్లు నిరుపయోగం
కేంద్రం సంస్థతో ఒప్పందం ద్వారా ఆహార భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని మంత్రి ఆదేశం
అమరావతి: రాష్ట్రంలో ఆహార భద్రతా ప్రమాణాల్ని పటిష్టంగా అమలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
ఆహార భద్రత విషయంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ కమీషనర్ శ్రీ సి.హరికిరణ్ ఇతర ఉన్నతాధికారులతో గురువారం నాడు రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం అమలుపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్షించారు.
ఆహార భద్రత చట్టం అమలు విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించినట్లు ఈ సమీక్షలో స్పష్టంగా వెల్లడయ్యింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వలన కేంద్రం విడుదల చేసిన రూ.79 కోట్లలో రూ. 65 కోట్లను గత ప్రభుత్వం వినియోగించలేదు.
ఈ నిర్వాకంతో వివిధ రకాల ఆహార పదార్ధాల నాణ్యతను పరీక్ష చేసే ప్రయోగశాలల సామర్ధ్యాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదు. గుంటూరు, తిరుపతి, విశాఖపట్నాలలో సమీకృత ప్రయోగశాలలు, పరికరాల కొనుగోలుకు ఉద్దేశించిన రూ.50 కోట్ల
కేంద్ర నిధుల్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆధునిక మైక్రో బయాలజీ ప్రయోగశాలను ప్రారంభించినా గత ప్రభుత్వం దానికి అవసరమైన కనీస పరికరాల్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇందు నిమిత్తం కేంద్రం రూ.13 కోట్లకు పైగా నిధులిచ్చినా రాష్ట్ర వాటాగా గత ప్రభుత్వం ఇవ్వాల్సిన కేవలం కోటి రూపాయల్ని కూడా ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
ఆహార భద్రతా ప్రమాణాల అమలు విషయంలో సంబంధిత విభాగాల్లో మొత్తం 558 పోస్టులు మంజూరు కాగా, 405 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ప్రజారోగ్యం కోసం భారీగా నియామకాలు చేశామని తరచూ చెప్పుకున్న గత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ చేసిన సమీక్షలో ష్టమయ్యింది.వివిధ ప్రయోగశాలల్లో 138 పోస్టులు మంజూరు కాగా, 95 పోస్టులు ఖాళీగా ఉండడంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఆహార భద్రతా ప్రమాణాల అమలు కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ యస్ యస్ ఎఐ) తో వెంటనే ఒప్పందం చేసుకుని రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.
ఇందుకోసం ప్రాంతీయ, రాష్ట్ర ప్రయోగశాలల్ని పటిష్టం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పట్టణాల్లో తాగు నీటి ప్రమాణాల్ని నిరంతరం పర్యవేక్షించడానికి తగు చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. ఆరోగ్య రక్షణ అధికారుల సంఖ్యను పెంచి ఆహార భద్రత ప్రమాణాలపై గట్టి నిఘా పెట్టాలని….ఈ దిశగా ఎఫ్ ఎస్ ఎస్ఎఐతో 2024-25 సంవత్సరానికి ఎంవోయును కుదుర్చుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలిచ్చారు.