ఏపీ కొత్త డీజీపీగా ఎవరికి అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్ అధికారులు..
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది.
ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది.
డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
అలాగే మే 6 ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా సిద్దం చేసి పంపాలని ఎన్నికల సంఘం సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సీహెచ్ తిరుమల రావు సీనియారిటీ ప్రకారం ప్యానల్ జాబితాలో చోటు సంపాధించుకున్నారు.
డీజీపీ ఎంపిక జాబితాలో అంజనా సిన్హా, మాది రెడ్డి ప్రతాప్‌లు ఉన్నారు.
ముగ్గురిలో ఎవరికో ఒక్కరికి ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది.
ముగ్గురిని కాకుండా మరొకరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న హరీష్ కుమార్ పేరును కూడా జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
ఏపీ డీజీపీ.. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.