ప్రధాన కాలువల్లో చెత్త తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయండి.
*కమిషనర్ ఎన్.మౌర్య
నగరంలోని ప్రధాన కాలువల్లో జరుగుతున్న చెత్త తొలగింపు పనులు రెండు, మూడు రోజుల్లోపు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను, మురుగు కాలువల్లో చెత్త తొలగింపు పనులను ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రధాన కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారం తొలగించే పనులు వేగవంతం చేసి రెండు మూడు రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కాలువల్లో తొలగించిన చెత్త తడితరాలను ఎప్పటికప్పుడు తరలించాలని అన్నారు. వర్షాలు ప్రారంభమైతే కాలువల్లో ఎక్కడికక్కడ నీరు ఆగిపోయి రోడ్లపై నీరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. దీని వలన ప్రజలకు ఇబ్బంది అవుతుందని, త్వరగా పనులు పూర్తి చేయించాలని అన్నారు. నగరంలో ఎక్కడ కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (జి.వి.పి) లో చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని హెల్త్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, మహేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్స్ చెంచయ్య, సుమతి తదితరులు ఉన్నారు.