నిబంధనల మేరకే అనుమతులు మంజూరు చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనల మేరకు అన్ని సక్రమంగా ఉంటేనే భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. నగరంలో అనధికారిక అపార్ట్మెంట్ల నిర్మాణం, ప్రకటన బోర్దుల రెన్యువల్, భవన నిర్మాణ ప్లాన్ అనుమతులు, తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో దరఖాస్తు చేసిన భవన నిర్మాణాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలకు నిర్దేశిత గడువులోగా తగిన అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. ఎటువంటి అనుమతులు మంజూరు చేయాలన్నా అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వారికే ఇవ్వాలని అన్నారు. నగరపాలక సంస్థ అనుమతులు అధికారికంగా ఉన్న అపార్ట్మెంట్లలోని ఫ్లాట్స్ కి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ కలగవనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అధికారులకు సూచించారు. నిబంధనలకు ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడితే తొలగించడం జరుగుతుందని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. నగరంలో ప్రకటన హార్డింగ్స్ కి అనుమతులు పరిశీలించి లేని వాటిని తొలగించాలని అన్నారు. అనుమతులు లేకుండా బోర్దులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. కోర్టులో వాజ్యం ఉన్న వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతులు మంజూరులో ఎటువంటి పొరపాట్లు జరిగినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా నగరపాలక సంస్థ తరపున అన్ని అనుమతులు ఉన్న అపార్ట్మెంట్స్, లేఔట్లలో ఫ్లాట్స్ కొనుగోలు చేస్తే, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ ఉండవని కమిషనర్ ప్రజలకు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డి.సి.పి. మహాపాత్ర, ఏ సి పి బాలాజి, రమణ, సర్వేయర్ కోటేశ్వర రావు, తదితరులు ఉన్నారు.