TEJA NEWS

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు.

వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు.

ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో (ఏప్రిల్‌ 18) వెలుగు చూసింది.

సీఎంఎస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా..

కేవలం గంటల వ్యవధిలోనే కేసు చేధించారు.

పోలీసుల తెలిపిన వివరాల మేరకు..

సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది గురువారం మధ్యాహ్నం రూ.68 లక్షలతో ఒంగోలు నుంచి బయలుదేరారు. నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్ల్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లో ఉన్న వివిధ ఏటీఎం మెషిన్లలో నింపేందుకు తీసుకెళ్తున్నారు. అయితే అదే రోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డు వద్ద ఉన్న ఇండియన్‌ పెట్రోల్‌ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపివేశారు. మధ్యాహ్నం కావడంతో తమ వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. ఇదే అదనుగా ఓ ఘటికుడు ముసుగు ధరించి వచ్చి వాహనం తాళాలు పగలగొట్టి రూ.64 లక్షల విలువ కలిగిన రూ.500 నోట్ల కట్టలను చోరీ చేసి ఉడాయించాడు. ఇంతలో సిబ్బంది భోజనాలు ముగించుకుని తిరిగి వచ్చిచూస్తూ వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే లోపల పరిశీలించగా అందులో రూ.100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. రూ.500 నోట్ల కట్టలు కనిపించలేదు.

వారు తెచ్చిన రూ.68 లక్షల్లో రూ.64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అడిషనల్‌ ఎస్పీ (క్రైమ్స్‌) ఎస్వీ శ్రీధర్‌రావు, తాలుకా సీఐ భక్తవత్సలరెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించడంతోపాటు సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి వాహనంలో నగదు చోరీ చేస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించారు. నిందితుడు మరెవరోకాదు గతంలో సీఎంఎస్‌ సంస్థలో పనిచేసి ఉద్యోగం వదిలేసిన మహేష్‌గా గుర్తించారు. నోట్ల కట్టలతో తన స్వగ్రామమైన సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెంలో అతడి ఇంటికి సమీపంలో ఉన్న ఓ మర్రిచెట్టు తొఱ్ఱలో నగదు దాచిపెట్టాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మర్రిచెట్టు తొర్రలో దాచిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు.


TEJA NEWS