TEJA NEWS

నగరంలో చెత్త కుప్పలు కనిపిస్తే కఠిన చర్యలు.

*నిర్దిష్ట సమయంలో వాహనాలు చెత్త సేకరణకు వెళ్ళాలి.

“కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరంలో రోడ్ల పక్కన, వీధుల్లో ఎక్కడైనా చెత్త కుప్పలు కనిపిస్తే సంబంధిత సిబ్బందిపైన, చెత్త వేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను హెచ్చరించారు. నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, శానిటరీ సెక్రటరీలు, సిబ్బంది విధులపై శుక్రవారం సాయంత్రం కచ్చపి ఆడిటోరియం లో శానిటరీ అధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. ఆయా వార్డుల్లో వార్డుల్లో మెస్ట్రీలు, శానిటరీ సెక్రటరీలు ఏ మేరకు పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించక పోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్యం సరిగా లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఏ వార్డులో అయినా, వీధిలో అయినా రోడ్లపైన చెత్త కుప్పలు కనిపించినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టేందుకు ఐదు వార్డులకు ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని అన్నారు.

ఇంటింటికి చెత్త సేకరణకు ప్రతి వాహనం నిర్దిష్ట సమయంలో వెళ్లేలా చూడాలని అన్నారు. నగరంలో ఉత్పత్తి అయిన చెత్త మొత్తం తూకివాకంకు తరలించి నిర్వహణ చేయాలని అన్నారు. ప్రతి వాహనం ఏ వార్డుల్లో వెళుతుంది, వాహనంతో ఎవరు వెళుతున్నారని స్పష్టమైన షెడ్యూల్ ను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజూ ఉదయం హాజరు నమోదు అయిన వెంటనే ప్రధాన వీధులను శుభ్రం చేస్తూ, చెత్త కుప్పలు తొలగించాలని అన్నారు. అటు తరువాత వీధుల్లో ఇంటింటి చెత్త సేకరణ చేయాలని అన్నారు. సేకరించిన చెత్తను నేరుగా చెత్త సేకరణ కేంద్రానికి తరలించాలని, అక్కడ నుండి తూకివాకం లోని చెత్త నిర్వహణ కేంద్రానికి తరలించాలని అన్నారు. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్త పూర్తిగా నిర్వహణ కేంద్రానికి తరలించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయని, పునరావృతం ఐతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలకు ట్రాక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో సి.సి. కెమెరా లు ఏర్పాటు చేయనున్నామని, ఎవరైనా చెత్త వేస్తే జరిమానాలు విధించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మేనేజర్ హాసీమ్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, శానిటరీ సెక్రటరీ లు, మేస్త్రి లు పాల్గొన్నారు.


TEJA NEWS