కూటమిలో కుమ్ములాట
చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ తీరుపై కౌన్సిలర్ల ఆవేదన!
తుఫాను సాయం పంపిణీలో 25వ వార్డు కౌన్సిలర్‌కు అన్యాయం
చిలకలూరిపేట పట్టణంలో మున్సిపల్ చైర్మన్ తీరుపై సొంత కూటమిలోని కౌన్సిలర్ల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పట్టణానికి ప్రథమ పౌరుడిగా కాకుండా, కొంతమందికి ప్రథమ పౌరుడిగానే చైర్మన్ వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి అద్దం పట్టేలా 25వ వార్డులో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.తాజాగా తుఫాను నేపథ్యంలో నిరుపేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, 25వ వార్డు పరిధిలో జరిగిన ఈ పంపిణీలో స్థానిక కూటమి కౌన్సిలర్‌కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా మున్సిపల్ చైర్మన్ వ్యవహరించారని సమాచారం. కౌన్సిలర్‌ను పూర్తిగా పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉండే గ్రూపులను ప్రోత్సహించే విధంగా చైర్మన్ తీరు కనిపించిందని స్థానిక కౌన్సిలర్ మరియు వార్డు నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటనతో మనస్తాపానికి గురైన స్థానిక కౌన్సిలర్ మరియు వార్డు నాయకులు, మున్సిపల్ చైర్మన్‌పై బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు కోరారు. రాబోయే ఈ మూడు నెలల కాలంలోనైనా చైర్మన్ అందరినీ, ముఖ్యంగా కౌన్సిలర్లను కలుపుకొనిపోయే విధంగా వ్యవహరించాలని , గత ప్రభుత్వ హయాంలో కూడా చైర్మన్ తీరు ఇదే విధంగా ఉందని, ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు రాలేదని స్థానిక కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే కూటమిలో ఉన్నప్పటికీ, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్ల మధ్య నెలకొన్న ఈ అంతర్గత విభేదాలు పట్టణ అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
